ఉద్ధవ్ థాక్రే డిమాండ్
ముంబయి: మహారాష్ట్రలోని కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతం(యుటి)గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే డిమాండు చేశారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడేవరకు ఆ ప్రాంతాలను యుటిగా ప్రకటించాలని ఆయన బుధవారం నాడిక్కడ కోరారు.
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంపై రచించిన ఒక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తూ ఆ ప్రాంతాలలో మరాఠీ మాట్లాడే ప్రజల పట్ల కర్నాటక ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఆ ప్రాంతాలకు చెందిన మరాఠీ ప్రజలను విలీనం చేసుకునేందుకు ఈ కేసును నెగ్గాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఒక పక్క ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతున్న తరుణంలో కర్నాటక ప్రభుత్వం బెల్గామ్ పేరు మార్చడమే కాక దాన్ని రెండవ రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ భవనాన్ని నిర్మించి ఒక అసెంబ్లీ సమావేశాలు అక్కడ నిర్వహించిందని ఆయన చెప్పారు. ఇది కోర్టు ధిక్కరణ కాదా అని ఆయన ప్రశ్నించారు. మరాఠీ ప్రజలు అత్యధికంగా నివసించే కర్నాటక సరిహద్దుల్లోని బెల్గామ్, కర్వార్, నిప్పని తదితర ప్రాంతాలు తమకు చెందినవని మహారాష్ట్ర వాదిస్తోంది. ఈ ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ డిమాండు చేస్తోంది.