సెనేట్‌లో తగినంత మంది మద్దతు కూడగట్టలేకపోయిన డెమోక్రాట్లు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సెనేట్‌లో జరుగుతున్న అభిశంసన విచారణనుంచి ఆయన బైటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన డెమోక్రాట్లు అది విజయం సాధించడానికి అవసరమైన మేర రిపబ్లికన్ పార్టీ సెనేటర్ల మద్దతు కూడగట్టడలేక పోవడమే దీనికి కారణం. తమకు సంఖ్యాబలం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌ను సులభంగా అభిశంసించిన డెమోక్రాట్లకు సెనేట్‌లో మాత్రం అభిశంసించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అయితే వంద స్థానాలున్న సెనేట్‌లో ప్రస్తుతం డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు చెరి సగం సభ్యులున్నారు. మూడింట రెండు వంతుల మార్క్‌కు చేరుకోవాలంటే డెమోక్రాట్లకు కనీసం 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. అయితే ఈ 17 మంది సెనేటర్ల మద్దతును డెమోక్రాట్లు ఎలా సంపాదిస్తారో తనకు అర్థం కావడం లేదని రిపబ్లికర్ పార్టీ సెనేటర్ జాన్ బూజ్‌మన్ అంటున్నారు.
అధ్యక్షపదవినుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్‌ను అభిశంసన విచారణ జరపడాన్ని వ్యతిరేకించే తీర్మానానికి మద్దతుగా 45 మంది రిపబ్లికన్ పెనేటర్లు ఓటు వేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సోమవారం రాత్రి ప్రతినిధుల సభనుంచి సెనేట్‌కు చేరిన అభిశంసన ఆర్టికల్‌పై వెంటనే విచారణ చేపట్టడమే సరయిన పని అని, ఓటింగ్‌పై నిర్ణయాన్ని సెనేట్‌లోని నేతలకే వదిలేయాలని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ జెన్ సాకి మంగళవారం విలేఖరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే మరోసారి ట్రంప్ అభిశంసన విచారణ జరపడం ద్వారా సెనేట్ సమయాన్ని వృథా చేసుకోవడం సరి కాదని రిపబ్లికన్ సెనేటర్ కెవిన్ క్రామర్ అభిప్రాయపడ్డారు.
ఒక మాజీ అధ్యక్షుడిని అభిశంసించడం సరికాదని రిపబ్లికన్ సెనేటర్లలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతుండగా, అది రాజ్యాంగ ప్రకారం సరైన చర్యేనని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. ఒక వేళ సెనేట్‌లో ట్రంప్ అభిశంసనపై చర్చ జరిగినా దాన్ని ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలం డెమోక్రాట్లకు లేకపోవడం వల్ల ట్రంప్ మరోసారి ఈ గండంనుంచి బైటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే సెనేట్‌లో అభిశంసన గండం నుంచి ట్రంప్ బైటపడ్డం ఏడాది కాలంలో ఇది రెండోసారి అవుతుంది.