Saturday, November 23, 2024

గాంధీపై ద్వేషం గాడ్సేవాదులకు లాభం

- Advertisement -
- Advertisement -

Hate against Gandhi is advantage of godse

భారత జాతిపితగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ పితగా బి. ఆర్.అంబేడ్కర్ ప్రజల చేత గౌరవించపడుతున్నారు. అణగారిన వర్గాలకి హక్కులు కల్పించేందుకు అంబేడ్కర్ విశేష కృషి చేయగా, దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ శాంతియుత మార్గంలో కృషి చేశారు. అయితే గాంధీ, అంబేడ్కర్ లకి నిమ్నవర్గాల వారికి హక్కులు కల్పించే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు లేవు. నేడు దేశంలో గాంధీజీపై విమర్శలు చేసేవారు రెండు రకాలవారుగా ఉన్నారు. అంబేడ్కర్ మహాశయుని వలే గాంధీ అణగారిన వర్గాల వారి హక్కుల కొరకు కృషి చేయలేదనేవారు కొందరైతే, గాంధీని చంపిన గాడ్సేని సమర్ధిస్తూ, గాంధీని విమర్శించేవారు మరికొందరు. మనం చిన్నప్పుడు విన్నట్లు గాంధీ జీ వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఎవరూ చెప్పడం లేదు.

కానీ గాంధీజీ అహింసా, సత్యాగ్రహం వంటి శాంతియుత మార్గాలలో పోరాడిన తీరు ఆధునిక కాలంలో జరుగుతున్న అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ఒకవైపు బ్రిటిష్ వారితో చర్చలు జరుపుతూనే, మరోవైపు వివిధ మార్గాల ద్వారా గాంధీ స్వాతంత్య్రం కోసం పోరాడారు. పెద్దగా ఎటువంటి రవాణా సదుపాయాలులేని ఆ రోజుల్లోనే గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటించడం ఒక విశిష్టత. ముందు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి ఆయన కృషి చేశారు. చంపారన్ ఉద్యమం అటువంటిదే. గాంధీ తాను హిందూ మతాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పుకోవడానికి ఏనాడూ సంకోచించలేదు. అదే క్రమంలో ఆయన పరమత సహనాన్ని ప్రదర్శించారు.

దేశ విభజన జరిగిన సమయంలో చెలరేగిన మత ఘర్షణలని రూపు మాపడానికి ఆయన బెంగాల్ రాష్ట్రంలో స్వయంగా పర్యటించారు. ఫలితంగా ఆయన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేక పోయారు. దేశ విభజనకి గాంధీ కారకుడని గాడ్సే ఆరోపించారు. గాంధీ ఆఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం బాగా పోరాడాడు అని, ఇండియా వచ్చాకే ఆయన ఆలోచనలు మారాయని గాంధీపై గాడ్సే విమర్శలు చేశారు. కానీ గాడ్సే ఆరోపణలలో వాస్తవం లేదు. నేడు గాడ్సేని ఆరాధించే వారి సంఖ్య పెరుగుతోంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు కూడా నేడు దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. ఎవరిపైన అయినా సహేతుకంగా విమర్శలు చేయవచ్చు.

కానీ గాంధీ వంటి మహానీయులపై విమర్శలు చేయడం వల్ల గాడ్సే వాదులకు లాభం కలుగుతుంది. గాడ్సే ఒక మతోన్మాది. గాడ్సే వంటి వారిని సమర్ధిస్తే మతోన్మాదం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బాపూజీ అనుచరులు, బాబా సాహెబ్ వాదులు ఒక్కతాటిపై నడవాలి. అంబేడ్కర్ హిందూ మతంలో ఉన్న దురాచారాలని విమర్శించారే గానీ, హిందువులపై ఆయన ఎప్పుడూ ద్వేషాన్ని చూపలేదు. గాంధీ జీ కూడా హిందూమతం లో ఉన్న అంటరానితనాన్ని ఖండించారు. బుద్ధుడు బోధించిన శాంతి, అహింసా మార్గాలను తన ఆయుధాలుగా గాంధీ ఎంచుకున్నారు. గాంధీ జీని ద్వేషిస్తే దేశంలో మతోన్మాదులకి మరింత బలం చేకూరుతుంది. తద్వారా అణగారిన వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News