న్యూఢిల్లీ: శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభం నేపథ్యంలో గాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక అధికార యంత్రాంగం ఇక్కడ నిరసనలలో ఉన్న రైతులు ఖాళీ చేసివెళ్లిపోవాలని ఆదేశించింది. అర్థరాత్రి దాటిన తరువాత ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు నిరసనలో ఉన్న రైతులను హెచ్చరించారు. దీనితో ఢిల్లీ యుపి సరిహద్దులలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము వ్యవసాయ చట్టాల రద్దు వరకూ ఉద్యమిస్తామని, ఖాళీ చేసేది లేదని రైతులు పట్టుపట్టారు. అయితే ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘర్షణలలో నిందితులైన రైతు నేతలను అరెస్టు చేసేందుకు పలు ప్రాంతాలలో రంగం సిద్ధం అయింది. తాము ఇక్కడి నుంచి వైదొలిగేది లేదని బుల్లెట్లు వచ్చి పడ్డా ఇక్కడనే నిరసనలలో ఉంటామని రైతు నేత రాకేష్ తికాయిత్ హెచ్చరించారు. తాను ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన తెలిపారు. అవసరం అయితే ప్రాణత్యాగానికి దిగుతానని తెలియచేయడంతో ఈ ప్రాంతంలో పరిస్థితి మరింతగా ఉద్రిక్తత నెలకొంది. సింఘౌ సరిహద్దులలో కూడా పరిస్థితి దిగజారింది. ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు రోడ్లను తవ్వేశారు. జెసిబి యంత్రాలను దింపారు. దీనితో రాత్రి పూట ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రైతులను సరిహద్దుల నుంచి బయటకు పంపించేందుకు బలప్రయోగానికి దిగేందుకు రంగంసిద్ధం అయింది. అయితే తమను నిరసన స్థలి నుంచి ఏ శక్తి బయటకు పంపించలేదని రైతు నేతలు ప్రకటించారు. దీనితో పార్లమెంట్ సెషన్‌కు ముందు రోజు తీవ్ర ఉద్రిక్తతలు ఢిల్లీ శివార్లలో అలుముకున్నాయి. శాంతియుత ప్రదర్శనలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని రాకేష్ తికాయత్ తెలిపారు. గాజీపూర్ సరిహద్దులలో ఎటువంటి హిం సాత్మక ఘటనలు జరగలేదని, అయితే దీనిని పట్టించుకోకుండా కేంద్రం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తికాయత్ విమర్శించారు. ప్రత్యేకించి యుపిలోని బిజెపి ప్రభుత్వం దమననీతి దారుణంగా మారిందని అన్నారు.
విద్యుత్ సరఫరా నిలిపివేత
సరిహద్దులలో భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దింపారు. రాపిడ్ యాక్షన్ బలగాలు వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలో అధికార యంత్రాంగం ఇప్పుడు కరెంటు నీరు సరఫరా నిలిపివేశారు. దీనితో రైతులు ఇప్పుడు తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు రైతులు వేలాది మంది రోడ్లపైకి వచ్చిచేరుతున్నారు. గాజీపూర్ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. అయితే ట్రాక్టరు ర్యాలీ దశలో రైతులు బారికేడ్లనుతొలిగించి ముందుకు సాగారు. దీనిని అధికార యం త్రాంగం నేరంగా పరిగణించింది. రైతు నేతలపై చట్టపరమైన చర్యలకు దిగుతోంది.
హర్యానా సరిహద్దులలోనూ ఇదే పరిస్థితి
సింఘూ సరిహద్దులలో ఢిల్లీ హర్యానా వెంబడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చుననే పరిస్థితి ఏర్పడింది. పోలీసుల వలయాలు ఉన్నప్పటికీ ఈ సమీప ప్రాంతాల్లోని స్థానికులు గుంపులుగా వచ్చి ఇక్కడి నుంచి రైతులను ఖాళీ చేయించాలని పట్టుపట్టడంతో రైతులకు వీరికి మధ్య ఘర్షణల పరిస్థితికి దారితీసింది. ఇక్కడికి వచ్చిన వారు జైశ్రీరాం నినాదాలు చేస్తూ హడావిడి చేశారు. రైతుల పేరిట కొందరు చివరికి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని అమానించారని, తమ జెండాను ఎగురేశారని, ఇంతకంటే దారుణం ఉంపందా అని వీరిని ఇక్కడ ఉండనిచ్చేది లేదని, పైగా తమ రాకపోకలకు జీవనానికి ఇబ్బందికరంగా ఇక్కడి రైతులు వచ్చిచేరారని మండిపడ్డారు.
హింసాత్మక చిత్రణ: సంయుక్త కిసాన్ మోర్చా
ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను రంగంలోకి దింపడం కేవలం తమ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకే అని రైతుల ఐక్యవేదిక విమర్శించింది. అన్ని వైపుల నుంచి తమను దిగ్బంధం చేయాలని యత్నిస్తున్నారని, తమ ఉద్యమంలో హింసాకారులు ఉన్నారని ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారని కిసాన్ మోర్చా ప్రతినిధులు మండిపడ్డారు. తమది ఎప్పటికీ శాంతియుత ప్రదర్శనలతో సాగే ఉద్యమమని తెలిపారు. కేవలం యుపి, పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాలలోని రైతు నేతలనే కాకుండా మహారాష్ట్ర ఇతర చోట్ల ఉన్న రైతు నేతలను కూడా ఎర్రకోట ఘటనల్లో నిందితులుగా కేసులు బుక్ చేశారు. ఎర్రకోటపై త్రివర్ణ పతా కం తొలిగించి ఖలీస్థాన్ అనుకూల పతాకం ఎగరవేయడం, విధ్వంసం వంటి చర్యలలో పాలుపంచుకున్నారని రైతు నేతలపై కేసులు బుక్ అయ్యాయి. దీనితో పలు రాష్ట్రాలలో రైతు నేతలను పట్టుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇది దేశవ్యాప్త ప్రకంపనలకు దారితీసింది.
Tension at ghazipur as farmers told to vacate protest sites