Saturday, November 2, 2024

ఇదంతా పోలీసు ట్రాపే : దీప్ సిద్ధూ

- Advertisement -
- Advertisement -

Deep Sidhu says Need time to bring out truth

చండీగఢ్: ఎర్రకోటపై గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలు పోలీసు ట్రాప్‌గా తాను భావిస్తున్నట్లు ఈ ఉదంతంలో వివాదాస్పదుడైన దీప్ సిద్ధూ తెలిపారు. యాక్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన 36 ఏండ్ల సిద్ధూ ఎర్రకోట ఘటనల విషయంలో ఒక్కరోజు క్రితం రైతు నేతలను బెదిరించారు. ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా పోలీసులు బిగించిన వలయం అని పేర్కొన్నారు. నిజాలను వెలుగులోకి తేవడానికి తనకు కొంత సమయం పడుతుందన్నారు. ఘటనపై జరిగే దర్యాప్తులో తాను సహకరిస్తానని శుక్రవారం ఆయన తెలిపారు. అంతా పోలీసుల వ్యూహం ప్రకారం జరిగిందనడానికి తన వద్ద పలు ఆధారాలు ఉన్నాయని ఆయన ఫేస్‌బుక్ లైవ్‌ను పొందుపర్చారు. రైతులు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరసన స్థలాల నుంచి ఎర్రకోటకు చేరుకోవడం, తిరిగి సురక్షితంగా అటకాయింపులు తలెత్తకుండా తమ స్థావరాలకు చేరుకోవడం ఇవన్నీ కూడా పోలీసు ట్రాప్‌లో భాగమేనని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఢిల్లీ పోలీసులు చేశారా? లేక ప్రభుత్వం చేసిందా? తెలియదు కానీ ఇది పూర్తి ఓ ట్రాప్‌గా ఉందని సిద్ధూ చెప్పారు. ఈ నెల 25వ తేదీ నాటి ఘటన పూర్వాపరాల గురించి వివరించారు. సింఘూ వేదిక వద్ద తాను రాత్రి అంతా ఉండి, తరువాత మరుసటి రోజు ఉదయం తన రూంకు వచ్చానని, తరువాత 11 గంటలకు తన కారులో బయలుదేరానని అప్పటికే ఎర్రకోట వద్ద అంతా ఇష్టారాజ్యం అయిందని అంతా చెప్పారని, దీనితో తాను విస్తుపోయినట్లు, నిబంధనల ప్రకారం ఆ విధంగా జరిగి ఉండాల్సింది కాదన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు పేలవంగా ఉన్నాయి. తన్నితే పడిపొయ్యేవిగా పెట్టారు. ట్రాక్టర్లు, కార్లను కీలకమైన దారులలో వెళ్లనిచ్చేందుకు పోలీసులు వీలు కల్పించారు.

ఇది తనకు అర్థం కాని విషయంగా మారిందన్నారు. తాము కారులో ఎర్రకోటకు చేరేసరికి , అక్కడ రోడ్డులో ఓ వ్యక్తి నుంచి తాను కేసరి జెండా, నిషాన్ సాహిబ్ జెండా పొందానని తెలిపారు. అప్పటికే ఎర్రకోటపై వేరే జెండా ఎగరేసి ఉందన్నారు. అంతేకాకుండా అక్కడ జరిగిన దానిపట్ల ఇద్దరు ఐపిఎస్‌లు కూడా ప్రశంసించారని , పైగా ప్రజలు తిరిగి వెళ్లడంలో సహకరించినందుకు వారు ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు. తనకు అరెస్టు వారంట్లు రావడంపై స్పందిస్తూ నిజాలు వెలుగులోకి తేవడానికి తనకు కొంత సమయం పడుతుందన్నారు. తానైతే ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని తేల్చిచెప్పారు. తనపై లుకౌట్ నోటీసు కూడా వెలువడిందని, అయితే తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఈ దశలో తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివన్నీ వదంతులే అని, నిజాలు వేరే ఉన్నాయని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News