Sunday, November 24, 2024

జస్టిస్ పుష్ప ఇక చాలించమ్మా

- Advertisement -
- Advertisement -

Supreme Court shock to Justice Pushpa Ganediwala

 

శాశ్వత హోదాకు సుప్రీం బ్రేక్

న్యూఢిల్లీ : వివాదాస్పద తీర్పులకు దిగుతున్న బొంబాయి హైకోర్టు మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టులో ఈ జడ్జికి శాశ్వత హోదాకు ఇంతకు ముందు చేసిన సిఫార్సును ఇప్పుడు సుప్రీంకోర్టు కొలిజీయం ఉపసంహరించుకుంది. గత కొద్ది రోజుల వ్యవధిలోనే చిన్నారులపై వేధింపుల కేసుల్లో శిక్షల విచారణ క్రమంలో ఈ న్యాయమూర్తి వెలువరించిన తీర్పులు వివాదాస్పదం అయ్యాయి. చర్మ సంబంధిత స్పర్శ తగిలితేనే లైంగిక వేధింపుల పరిధిలోకి వస్తుందని, జిప్ విప్పడం , దుస్తుల పై నుంచి తడమడం పోస్కో పరిధిలో శిక్షల పరిధిలోకి రాదని ఈ న్యాయమూర్తిణి తీర్పులు వెలువరించారు. జస్టిస్ పుష్ఫ గనేడివాలా బాంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్‌పూర్ బెంచ్‌లో న్యాయమూర్తి. ఈ నెల 20వ తేదీననే ఈ బెంచ్‌కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిని చేసే సిఫార్సును కొలీజియం సిద్ధం చేసింది. అయితే ఐదేళ్లు, 12 ఏండ్ల బాలికలపై లైంగిక వేధింపుల విషయాన్ని ఈ న్యాయమూర్తి తనదైన కోణంలో తేలిగ్గా తీసుకున్నట్లు తీర్పుల దశలో వెల్లడైంది. బాలికలపై లైంగిక చేష్టలకు దిగిన వారికి కింది న్యాయస్థానం వేసిన శిక్షలను నిలిపివేస్తూ ఈ లేడీ జస్టిస్ తీర్పులు వెలువరించడం చర్చనీయాంశం అయింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఇప్పుడు స్పందించిందని వెల్లడైంది. ఈ న్యాయమూర్తిని శాశ్వత ప్రాతిపదికన న్యాయమూర్తిగా నియమించడం జరిగితే చిన్నారులపై దాడులకు దిగే వారి పట్ల పడే శిక్షల విషయంలో తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని కొలీజియం భావించినట్లు వెల్లడైంది. లైంగిక కేసులకు సంబంధించి ఈ న్యాయమూర్తి వెలువరించిన తీర్పులపై కేంద్రం తీవ్రంగానే స్పందించింది. జస్టిస్ పుష్ఫ ఇచ్చిన తీర్పును కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడ్డ వ్యక్తికి వెలువరించిన శిక్షను రద్దు చేసే తీర్పును నిలిపివేయాలని అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయమూర్తిణి ఇటువంటి తీర్పును వెలువరించడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని, భవిష్యత్తులో వీటిని రెఫరెన్స్‌లుగా తీసుకుంటే బాలలపై లైంగిక వేధింపుల తీవ్రత విషయంలో తేలికపాటి వైఖరికి దారితీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో జస్టిస్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపధ్యంలోనే ఆమెకు పూర్తి స్థాయి జడ్జి హోదాకు కొలీజియం బ్రేక్ వేసినట్లు స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News