సుప్రీంకోర్టులో సోనూ సూద్ పిటిషన్
న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణ నోటీసును సవాలు చేస్తూ ప్రముఖ నటుడు సోనూ సూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబైలోని తన నివాస స్థలాన్ని వాణిజ్యపరంగా హోటల్‌గా మార్చారని అక్టోబర్‌లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) దీనిని తొలిగించాలని నోటీసు వెలువరించింది. యాక్టర్ దీనిని రద్దు చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సూద్ సర్వోత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తన నివాసంలో కొంత భాగాన్ని ఇతరత్రా వాడకానికి వినియోగించుకోవచ్చునని మున్సిపల్ కమిషనర్ అనుమతించారని, అయితే తీర ప్రాంత నిర్వహణ అధీకృత సంస్థ షరతులు వర్తిస్తాయని తెలిపారని సోనూ సూద్ తమ పిటిషన్‌లో వివరించారు. సంబంధిత అనుమతిని పూర్తి స్థాయిలో పొందడానికి తాను చట్టపరంగా ప్రయత్నిస్తున్నానని, ఈ దశలోనే అక్రమ నిర్మాణం అంటూ వెలువడ్డ నోటీసును తాను హైకోర్టులో సవాలు చేశానని, న్యాయం దక్కలేదని ఈనటుడు విన్నవించుకున్నారు. సంబంధిత నిబంధనలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తమ పిటిషన్‌ను తిరస్కరించిందని నటుడు ఆయన భార్యతో కలిసి పిటిషన్‌లో తెలియచేసుకున్నారు.