Monday, November 18, 2024

రేపటి నుంచే హౌస్‌ఫుల్..

- Advertisement -
- Advertisement -

చిత్రం … నేటి నుంచే హౌస్‌ఫుల్
నూటికి నూరుపాళ్ల ఆట తిరిగి షురూ
పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఓ శుభవార్త. సోమవారం(ఫిబ్రవరి 1) నుంచి సినిమాహాళ్లు నూటికి నూరుపాళ్ల ఆక్యుపెన్సీతో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇస్తున్నట్లు సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రకటించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ థియేటర్లు ఇక పూర్తిస్థాయిలో నడిచేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో గత ఏడాది అంతం వరకూ దాదాపుగా థియేటర్లు మూతపడ్డాయి. అయితే గత అక్టోబర్ నుంచి 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో వీటిని తెరుచుకునేందుకు అనువైన కొవిడ్ మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది. అయితే తమ రోజువారి కలెక్షన్లకు నష్టదాయకం అవుతుందని భావించుకుని అత్యధిక శాతం సినిమా హాళ్లు తెరుచుకోలేదు. ఇతరత్రా వ్యాపార సముదాయాలుండే మల్టీప్లెక్స్‌లలో వీటిని తెరిచారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో సాధారణ థియేటర్లు కూడా తెరుచుకుంటాయి. సరైన భౌతికదూరాలు, అనివార్యంగా మాస్క్‌లు, లోపలికి ప్రవేశించగానే శానిటేషన్, ప్రతి ఆట తరువాత తెర వద్ద హాల్‌లోపల పరిశుభ్రత వంటి చర్యలను థియేటర్ల యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నియమ నిబంధనలకు జనం కూడా సహకరించి తమ సినీ వినోదాన్ని పొందవచ్చు.

ఇంతకాలం సముచిత రీతిలో థియేటర్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రేక్షకులు సినీ భారీ స్థాయి వీక్షణ అవకాశాన్ని కోల్పొయారు. నిర్మాతలు పంపిణీదార్లు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలను చేపట్టారు. అయితే సినిమాల విజయానికి కేవలం థియేటర్లకు భారీగా వచ్చిపడే జనమే గీటురాయి అవుతుందని అంతా గుర్తించారు. థియేటర్ల సంపూర్ణ స్థాయి పునః ప్రారంభానికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ పద్థతులు (ఎస్‌ఒపి)లను మంత్రిత్వశాఖ వెలువరించింది. జనం కిక్కిరిసి ఉండకుండా చేయడానికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లు, విరామ సమయాలతో కూడిన షో వేళలను ప్రోత్సహిస్తూ మార్గదర్శకాలు వెలువరించారు. ఇది నిజంగా మంచి వార్త అని, ఫిబ్రవరి నెల నుంచి ప్రేక్షకులు తమ ఇష్టమైన సినిమాలను థియేటర్లకు వచ్చి చూడవచ్చునని, ఇంతవరకూ పోయిన ఆనందాన్ని తిరిగి దక్కించుకోవచ్చునని ప్రకాశ్ జవదేకర్ విలేకరుల సమావేశంలో స్పందించారు. హాళ్లకు వచ్చే వారు టికెట్ల కౌంటర్ల వద్ద, వెయిటింగ్ రూంల వద్ద ఖచ్చితంగా ఆరడుగుల దూరం నిబంధనను పాటించాల్సి ఉంటుంది. అత్యధికంగా ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తామని, ఇంట్లో ఉండి టికెట్లు తీసుకుని నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి ఆనందించవచ్చునని మంత్రి సలహా ఇచ్చారు.

దేశంలో క్రమేపీ కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాక్సిన్ రాకడ, సామూహిక వైరస్ వ్యాప్తి ఘటనలు లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవలి కాలంలో వరుసగా ఆంక్షల ఎత్తివేత చర్యలు ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు థియేటర్ల పూర్తి స్థాయి ఓపెన్‌కు అనుమతిని ఇచ్చారు. థియేటర్ల ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతలను కొలిచే థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు ఉండాలి. అనారోగ్యం ఉన్నట్లు తేలితే సదరు వ్యక్తిని లోపలికి అనుమతించరాదు. ఇక థియేటర్లలో హాండ్‌వాష్‌లు, శానిటైజర్లు తగిన రీతిలో ఉంచాలి. థియేటర్ల లోపల 2430 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండేలా చూడాలి. సరైన సంఖ్యలో కౌంటర్ల ఏర్పాటు తప్పనిసరి. థియేటర్లలోపలి స్నాక్స్ స్టాల్స్ నుంచి కొనుగోలు చేసే తినుబండరాలు, డ్రింక్స్ ఇంతకు ముందటిలాగానే థియేటర్లలోపలికి తీసుకుపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ షోల మధ్య సరైన విరామం ఉండాలి. ప్రేక్షకులు గుమికూడకుండా చూసుకోవాలి.
నిర్మాతల మండలి హర్షం
థియేటర్ల 100 శాతం సీట్ల కెపాసిటి రీ ఒపెన్ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. గిల్డ్‌తో పాటు మల్టీప్లెక్స్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సంబంధిత సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఈ విషయంలో తమ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని ప్రకటించారు.

Centre allows to full Occupancy in theaters from Feb 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News