చండీగఢ్ : భర్తను చంపిన భార్య అయినా ఆమెకు పింఛన్ అందాల్సిందేనని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది. సాధారణంగా ఓ ప్రభుత్వోద్యోగి చనిపోతే ఆయన భార్యకు పెన్షన్ అందుతుంది. అయితే సదరు భార్యనే భర్తను చంపివేస్తే ఆమెకు పింఛన్ ఇవ్వవచ్చా అనే వ్యాజ్యం హైకోర్టు విచారణకు వచ్చింది. భర్తను చంపినట్లు నిర్థారణ అయిన భార్యకు పెన్షన్ ఇవ్వడానికి హర్యానా ప్రభుత్వం నిరాకరించింది. అయితే బల్జీత్ కౌర్ అనే మహిళ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లగా ఆమెకు పింఛన్ అందేలా వీలు కల్పిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కౌర్ భర్త ప్రభుత్వోద్యోగి. ఆయన 2008లో చనిపోయాడు.
ఆయన మరణం వెనుక ఆమె హస్తం ఉందని 2011లో తేలింది. అప్పటివరకూ పెన్షన్ ఇస్తూ వచ్చిన సర్కారు ఆమె దోషిగా తేలడంతో దీనిని నిలిపివేసింది. అయితే ప్రభుత్వోద్యోగి చనిపోతే సంబంధితులకు ప్రత్యేకించి జీవిత భాగస్వామికి పింఛన్ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దశలో అప్పటికే ఆమెకు పింఛన్ ముడుతూ ఉన్నందున దోషిగా నిర్థారణ కాగానే దీనిని నిలిపివేయడం అనుచితం అవుతుందని హైకోర్టు పేర్కొంది. ఆమెకు పూర్తి బకాయిలతో పాటు పింఛన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిసిఎస్ నిబంధనల మేరకు భర్త మరణించిన తరువాత రెండో పెళ్లి చేసుకున్న మహిళకు కూడా పెన్షన్ అందాల్సి ఉందనే నిబంధన ఉందని కోర్టు ఈ విచారణ దశలో తెలిపింది.