న్యూఢిల్లీ: స్వావలంబనకు పర్యాయపదంగా మారిన ఆత్మనిర్భరతను 2020 సంవత్సరానికి తన హిందీ పదంగా ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ ఎంపిక చేసింది. కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించడంలో భారతీయులు సాధించిన రోజువారీ విజయాలకు నిదర్శనంగా ఆత్మనిర్భరత నిలిచిన కారణంగా ఈ పదాన్ని 2020 సంవత్సరానికి హిందీ పదంగా భాషా నిపుణులు కృతికా అగర్వాల్, పూనమ్ నిగమ్, ఇమోజెన్ ఫాక్సెల్‌తో కూడిన సలహా కమిటీ ఎంపికచేసింది.
గడచిన సంవత్సరంలో ప్రజల భావోద్వేగాలు, చవిచూసిన పరిస్థితులు, నాటి సంఘర్షణలను ఎదుర్కొన్న తీరును ప్రతిబింబించే హిందీ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ ఏటా ఎంపిక చేస్తుంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్‌ను ఎదుర్కోవడానికి ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటిస్తున్న సందర్భంగా దేశం ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిపరంగా స్వావలంబన సాధించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ అనే పదాన్ని ప్రయోగించారు. తదనంతరం ప్రధానితో పాటు పలువురు ఈ పదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొద్ది కాలంలోనే ఆత్మనిర్భరత అనే మాట జనబాహుళ్యంలోకి చొచ్చుకువెళ్లిపోయింది. కొవిడ్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భరత సమాధానంగా నిలిచిందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. గతంలో ఆధార్(2017), నారీ శక్తి(2018), సంవిధాన్(2019) హిందీ పదాలను ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ ఎంపిక చేసింది.