సింఘు సరిహద్దు వద్ద ముళ్లకంచె
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన వచ్చే అక్టోబర్‌లోగానే ఆపేస్తామన్నదానిలో నిజం లేదని బికెయు నేత రాకేశ్‌తికాయత్ స్పష్టం చేశారు. ఇప్పుడు తమ నినాదం ‘ చట్టాలు వాపస్ తీసుకునే వరకూ, ఇళ్లకు వాపస్ వెళ్లేది లేదు’ అని ఆయన తెలిపారు. పలు దఫాల చర్చల అనంతరం కూడా కేంద్రం పదేపదే చెబుతున్నమాట వ్యవసాయ చట్టాల వల్ల రైతులకే మేలని. అంతేగాక చట్టాల్లోని క్లాజుల వారీగా చర్చలు జరపాలని. అయితే, చట్టాల వల్ల తమ భూములన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాంతో, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకూ ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
పోలీసుల వేధింపులు ఆపకుండా కేంద్రం చర్చలకు పిలిస్తే వెళ్లబోమని 40 రైతు సంఘాల ఐక్యసంఘటన సంయుక్త కిసాన్‌మోర్చా(ఎస్‌కెఎం) కూడా తేల్చి చెప్పింది. బారికేడ్లు, ఇనుప కంచెలు, రోడ్లపై గోతులు తొవ్వుతూ, ఇంటర్‌నెట్‌ను నిలిపివేసి పోలీసులతో తమను వేధింపులకు గురి చేస్తోందని ఎస్‌కెఎం మండిపడుతోంది. స్థానికుల పేరుతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో తమపై దాడులు జరిపిస్తోందని విమర్శించింది. పోలీసుల నిర్బంధంలో ఉన్న రైతు ఆందోళనకారులను విడుదల చేసే వరకూ కేంద్రంతో చర్చలు జరిపేది లేదని ఎస్‌కెఎం తెలిపింది.
ఢిల్లీహర్యానా సరిహద్దులోని సింఘు వద్ద పోలీసుల పహారా మధ్య ముళ్ల కంచెతో కూడిన బారికేడ్లు నిర్మిస్తున్నారు. రెండు వరుసలుగా నిర్మించిన సిమెంట్ గోడల మధ్య ఇనుప చువ్వలతో కంచె ఏర్పాటు చేయిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి పలువురు కార్మికులతో ఇనుప చువ్వలతో కంచెను నిర్మింపజేస్తూ భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మకఘర్షణ అనంతరం ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులు మరోసారి ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకే ముళ్ల కంచెను ఏర్పాటు చేస్తున్నారని అర్థమవుతోంది. ముళ్ల కంచెలతో తమ ఆందోళనను అడ్డుకోలేరని రైతులు అంటున్నారు.