Tuesday, November 26, 2024

వెనుదిరిగిన ఎంపిలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద రైతులను కలుసుకోవడానికి వెళ్లి భంగపడిన 15మంది పార్లమెంట్ సభ్యుల బృందం
ఢిల్లీ పోలీసులు అనుమతించినా అడ్డుకున్న యుపి పోలీసులు
3 కి.మీ. దూరంలోనే ఆపివేత
బృందంలో హర్‌సిమ్రత్ కౌర్, సుప్రియా సూలే, కనిమొళి తదితరులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసేందుకు పది ప్రతిపక్ష పార్టీలకు చెందిన 15 మంది ఎంపిల బృందం గురువారం ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు వీరిని ఆందోళన స్థలానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఎంపిలు తీవ్ర నిరసన తెలియజేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు శిరోమణి ఆకాలీదళ్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నేతృత్వంలో వీరంతా ఘాజీపూర్‌కు గురువారం ఉదయం చేరుకున్నారు. ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె, డిఎంకె ఎంపిలు కనిమొళి, తిరుచ్చి శివ, టిఎంసికి చెందిన సౌగతా రాయ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అయితే ఘాజీపూర్ ధర్నా ప్రాంతానికి వెళ్లేందుకు ఢిల్లీ పోలీసులు వీరికి అనుమతి ఇచ్చినప్పటికీ యుపి పోలీసులు అడ్డుకున్నారు. ఎంపిలు రైతులను కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు రైతులను కలవకుండానే వెనుదిరిగారు. పోలీసుల తీరుపై ఎంపిలు మండిపడ్డారు.‘ఘాజీపూర్ వద్ద పరిస్థితులు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అన్నదాతల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరం. కాంక్రీట్ బారికేడ్లు, వైర్ ఫెన్సింగ్ మధ్య రైతులను ఉంచారు. కనీసం అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలను కూడా ధర్నాస్థలికి వెళ్లనీయడం లేదు. పార్లమెంటులో రైతు అంశాన్ని లేవనెత్తనీయడం లేదు. అందుకే ఇక్కడి పరిస్థితులను తెలుసుకుందామని వస్తే మమ్మల్ని 3 కిలోమీటర్ల దూరంలోనే అపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు ఎంపిలను కూడా అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా చీకటి రోజు’ అని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Opp MPs Stopped by UP Police at Ghazipur border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News