రాణించిన సిబ్లి, నిరాశ పరిచిన భారత బౌలర్లు, ఇంగ్లండ్ 263/3
చెన్నై: భారత్‌తో శుక్రవారం ప్రారంభమైన ఆరంభ టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెన్నైలో మొదటి టెస్టు జరుగుతోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 128 (బ్యాటింగ్) అజేయ శతకంతో కదం తొక్కాడు. అతనికి తోడు డొమినిక్ సిబ్లి (87) అండగా నిలిచాడు. దీంతో తొలి రోజు ఇంగ్లండ్ పైచేయి సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలావుండగా ఆతిథ్య భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సీనియర్ స్పిన్నర్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, షైబాజ్ నదీమ్‌లకు తుది జట్టులో చోటు లభించింది. మరోవైపు తెలుగుతేజ మహ్మద్ సిరాజ్, యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌లకు నిరాశే మిగిలింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు.
శుభారంభం
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రోరి బర్న్, డొమినిక్ సిబ్లి శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కుదురైన బ్యాటింగ్‌తో జట్టుకు పైచేయి అందించారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇటు బర్న్, అటు సిబ్లి అద్భుత సమన్వయంతో ఆడడంతో ఇంగ్లండ్ మంచి ఆరంభం లభించింది. అయితే రెండు ఫోర్లతో 33 పరుగులు చేసిన బర్న్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన డానియల్ లారెన్స్ (౦)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో అదే స్కోరు వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఆదుకున్న రూట్, సిబ్లి
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ జో రూట్, ఓపెనర్ సిబ్లి తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆరంభంలో ఆత్మరక్షణ బ్యాటింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. ఈ జంటను విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భీకర ఫామ్‌లో ఉన్న రూట్ ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ జట్టుకు పైచేయి అందించాడు.
అతనికి సిబ్లి పూర్తి సహకారం అందించాడు. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో ఇంగ్లండ్ పటిష్టస్థితికి చేరుకుంది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సిబ్లి 286 బంతుల్లో 12 ఫోర్లతో 87 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే క్రమంలో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 200 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ 197 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 128 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 89.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
జో రూట్ అరుదైన రికార్డు
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన రికార్డును సాధించాడు. రూట్ కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా రూట్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వందో టెస్టులో శతకం సాధించిన 9వ క్రికెటర్‌గా రూట్ ఘనత సాధించాడు. అంతేగాక 98, 99 టెస్టుల్లో కూడా శతకాలు సాధించిన రూట్ వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో కూడా రూట్ శతకాలతో అలరించిన విషయం తెలిసిందే.