ఇప్పటికే 15 దేశాలకు సరఫరా
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశం ఇప్పటివరకు 15 దేశాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరా చేసిందని, మరో 25 దేశాలు భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ కోసం క్యూలో ఉన్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. శనివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ నుంచి కరోనా టీకా కోసం మూడు క్యాటగిరీలకు చెందిన దేశాలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. పేద దేశాలు, ధరలపై ఆధారపడిన దేశాలు, ఫార్మసీ కంపెనీలతో నేరుగా చర్చలు జరుపుతున్న దేశాలుగా వాటిని విభజించవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 15 దేశాలకు కరోనా టీకాలు సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. కరోనా టీకా కోసం మరో 25 దేశాల వరకు వేచి ఉన్నాయని ఆయన తెలిపారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడంతో ప్రపంచ పటంలో భారత్‌కు స్థానం దక్కిందని ఆయన అన్నారు.
కొన్ని పేద దేశాలకు గ్రాంట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నామని, మరి కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీదారులకు చెల్లిస్తున్న మేరకు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నాయని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత కంపెనీలతో కొన్ని దేశాలు నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని జైశంకర్ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచానికే ఫార్మసీగా తయారుచేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్షమని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ఇప్పటికే భారత్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. గత నెల 16 నుంచి వ్యాక్సిన్లను దేశంలోని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ముందుగా వేస్తున్నారు.