Friday, November 22, 2024

పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పనితీరు భేష్

- Advertisement -
- Advertisement -

Modi hails country Judiciary for safeguarding People’s Rights

 

ప్రధాని మోడీ ప్రశంసలు

అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ రాజ్యాంగాన్ని కూడా న్యాయవ్యవస్థ బలోపేతం చేసిందని ఆయన అన్నారు. గుజరాత్ హైకోర్టు 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం నాడు జరిగిన ఒక వర్చువల్ సమావేశంలో స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అత్యున్నత న్యాయస్థానాలతో పోలిస్తే భారత సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అత్యధిక సంఖ్యలో కేసుల విచారణ జరిపిందని అన్నారు. దేశ న్యాయవ్యవస్థను భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసే క్రమంలో కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ప్రధాని తెలిపారు. రాజ్యాంగాన్ని నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా వివరించడం ద్వారా మన రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్థ మరింత బలోపేతం చేసిందని ఆయన తెలిపారు.

పౌరుల హక్కుల పరిరక్షణ విషయంలో కాని వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో కాని లేదా దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితులలో కాని మన న్యాయవ్యవస్థ అన్నిటినీ అర్థం చేసుకుని తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించిందని ప్రధాని అన్నారు. ప్రాచీన భారతీయ గ్రంథాలలో పొందుపరిచినట్లుగా సుపరిపాలన మూలాలు మన చట్టాలలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలం నుంచి ఈ ఆలోచనలు మన సంస్కారంలో భాగంగా ఉన్నాయని, మన స్వాతంత్య్ర పోరాటానికి ఈ మంత్రం మరింత నైతిక బలాన్ని ఇచ్చిందని, మన రాజ్యాంగ రూపకర్తలు కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని అన్నారు.

న్యాయవ్యవస్థ పట్ల ఈ నమ్మకమే సామాన్య ప్రజలలో విశ్వాసాన్ని నింపుతుందని, ఇదే సత్యం పట్ల నిలబడే బలాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కోర్టు విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేసిన తొలి న్యాయస్థానంగా దేశంలో గుజరాత్ హైకోర్టు నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా దేశంలో న్యాయవ్యవస్థ వేగంగా ఆధునీకరణ చెందుతుందోని ఆయన చెప్పారు. దేశంలో నేటికి 18,000 కోర్టులో కంప్యూటరీకరణ పూర్తి చేసుకున్నాయని, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలి కాన్ఫరెన్సింగ్‌కు సుప్రీంకోర్టు నుంచి చట్టబద్ధత రావడంతో దేశంలోని అన్ని కోర్టులలో ఇ-కార్యకలాపాలు పుంజుకున్నాయని ఆయన తెలిపారు. కేసుల కేసు వివరాలు తెలుసుకునేందుకు ఇ-ఫైలింగ్, యూనిక్ ఐడి, క్యూఆర్ కోడ్స్ ఈజ్ ఆప్ జస్టిస్ వంటి సౌకర్యాలు ఏర్పడడంతో ఈజ్ ఆఫ్ జస్టిస్‌కు కొత్త రూపు ఏర్పడిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News