పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం
న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర నిపుణులు ఆదివారం తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచు చరియ విరిగిపడి ధౌలి గంగానదిలో వరద నీరు ఉప్పొంగడంతో జలప్రళయానికి దారి తీసింది. బలహీనమైన పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను తప్పనిసరిగా విరమించాలని గ్రీన్పీస్ ఇండియా కు చెందిన వాతావరణ ఉద్యమ సీనియర్ నేత అవినాష్ చంచల్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో ఈ వైపరీత్యం ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడే చెప్పలేమని అయితే వాతావరణ మార్పు, భూతాపం వల్లనే జరిగి ఉంటుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి)కి చెందిన నిపుణులు అంజల్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు.
ఏమాత్రం పర్యవేక్షణ లేని ప్రాంతం హిమాలయ రీజియన్ అని, చాలా దగ్గరగా ఈ ప్రాంతాలను పర్యవేక్షించి పర్యావరణాన్ని కాపాడుకోడానికి, ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం చాలా వరకు వనరులు, నిధులు ఖర్చుచేయవలసి ఉందని సూచించారు. మంచు చరియ విరిగి పడడం అరుదైన సంఘటనగా ఐఐటి ఇండోర్ గ్లేసియోలజీ, హైడ్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఫరూక్ అజామ్ పేర్కొన్నారు. శాటిలైట్, గూగుల్ ఛాయాచిత్రాల్లో హిమానీ నదాలు అక్కడ ఉన్నట్టు చూపించక పోయినా జలాశయం ఉండే అవకాశం ఉందని అన్నారు. మంచు చరియల ఉష్ణోగ్రతలు రానురాను పెరుగుతున్నాయని, ఇదివరకు 6 నుంచి 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండగా, ఇప్పుడు 2 డిగ్రీలవరకు ఉంటోందని, దీనివల్ల మంచు ఖండాలు వేగంగా కరిగిపోయే ప్రమాదం ఏర్పడుతోందని చెప్పారు.