మనతెలంగాణ, హైదరాబాద్ : డబ్బుల కోసం యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కూకట్‌పల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన జంబాడా లక్ష్మివరప్రసాద్ నగరంలోని మల్లంపేటకు చెందిన యువతికి ఫేబుక్‌లో పరిచయం ఏర్పడింది. నిందితుడు సీరియల్ యాక్టర్ రవికృష్ణ పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా ఓపెన్ చేశాడు. అతడి నుంచి ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ రావడంతో బాధితురాలు అంగీకరించింది. అదే రోజు తనతో డేట్‌కు వస్తావా అని మెసేజ్‌పంపించాడు. తర్వాత సెఫ్ఫీ ఫొటో పంపించమని కోరాడు. మళ్లీ న్యూడ్ పిక్చర్లు పంపించాల్సింది మెసేజ్ పెట్టాడు. తనకు పర్సనల్ అవసరాల కోసం రూ.2,000 పంపించాల్సిందిగా కోరాడు. వారం తర్వాత రూ.30,000 ఇవ్వాల్సిందిగా కోరాడు. డబ్బులు ఇవ్వకుంటే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.
దీంతో భయపడిన బాధితురాలు రూ.5,000 పంపించింది. అప్పటి నుంచి వివిధ కారణాలు చెప్పి దఫదఫాలుగా రూ.2,20,000 తీసుకున్నాడు. అయినా కూడా నిందితుడు వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారణ చేశారు. కోర్టులో ప్రవేశపెట్ట సాక్షాలు పరిశీలించి కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.