Friday, November 15, 2024

విపత్తు నుంచి 27మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

- Advertisement -
- Advertisement -

Rescue team rescue 27 people from disaster

 

18 మృతదేహాలు లభ్యం, ఇంకా 202మంది గల్లంతు
సహాయక చర్యలకే ప్రథమ ప్రాధాన్యత ః ఉత్తరాఖండ్ సిఎం రావత్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని వరద విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు సోమవారం కూడా కొనసాగాయి. సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతోపాటు ఐటిబిపి జవాన్లు, వైమానిక దళాల్ని కూడా రంగంలోకి దించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి భారీ వరదలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో సోమవారం వరకు 18 మృతదేహాలను వెలికితీయగా, మరో 202మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. గల్లంతైనవారిలో రెండు విద్యుత్ ప్రాజెక్టుల వద్ద పని చేస్తున్నవారితోపాటు సమీప గ్రామాల ప్రజలున్నారని తెలిపింది. వరదల వల్ల పలుచోట్ల చిక్కుకున్నవారిలో 27మందిని కాపాడినట్టు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం తెలిపింది. సురక్షితంగా బయటపడినవారిలో 12మంది రెండు సొరంగాల్లో చిక్కుకున్నవారు కాగా, మరో 15మంది రుషీగంగా వద్ద గల్లంతైనవారని తెలిపింది.

ఆదివారం సంభవించిన భారీ వరదల్లో ఎన్‌టిపిసికి చెందిన 480 మెగావాట్ల తపోవన్‌విష్ణుగడ్ ప్రాజెక్ట్, 13.2 మెగావాట్ల రుషీగంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. తపోవన్ ప్రాజెక్ట్ వద్ద నిర్మాణదశలో ఉన్న 250 మీటర్ల సొరంగంలో 3035మంది కార్మికులు చిక్కుకున్నట్టు ఆ రాష్ట్ర డిజిపి అశోక్‌కుమార్ తెలిపారు. సమీపంలోని రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, వారికి నిత్యావసరాలు సరఫరా చేయనున్నట్టు ఆయన తెలిపారు. బాధితులను కాపాడటం, విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సహాయం అందించడానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ అన్నారు. సోమవారం కేంద్రమంత్రులు రమేశ్‌పోఖ్రియాల్, ఆర్‌కె సింగ్, ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్‌తో కలిసి తపోవన్, రైనీ ప్రాంతాల్లోని బాధితుల్ని పరామర్శించారు.

వరదల్లో చిక్కుకున్న జోషీమఠ్ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతైనవారిని కనిపెట్టడం, మృత దేహాల్ని వెలికి తీయడం కోసం పోలీసు జాగిలాలతోపాటు పలు ఆధునిక పరికరాలు, జెసిబిలు ఉపయోగిస్తున్నారు. మిగ్17 వైమానికదళ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని ఎన్‌డిఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం తమ ఆపరేషన్ కొనసాగుతోందని ఐటిబిపి ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే తెలిపారు. ప్రతి ఒక్కరినీ కాపాడగలమన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News