త్వరలో అమలులోకి : కేంద్ర కార్మికశాఖ
న్యూఢిల్లీ: త్వరలో అమలులోకి రానున్న నూతన కార్మిక స్మృతుల(చట్టాల) వల్ల వారానికి నాలుగు రోజుల పని విధానానికి వీలు కల్పించనున్నట్టు కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారు. ఈ ఆప్షన్‌ను ఎన్నుకున్నపుడు ఉద్యోగులకు మూడు రోజుల సెలవు ఇవ్వాలని తెలిపారు. నాలుగురోజుల విధానంలో రోజుకు 12 గంటలపాటు, ఐదు రోజుల పనిలో రోజుకు 10 గంటలపాటు, ఆరు రోజుల పనిలో రోజుకు 8 గంటలపాటు కార్మికులతో పని చేయించుకునే వీలుంటుంది. అయితే, వారంలో గరిష్ఠంగా 48 గంటలకన్నా అధిక సమయం పని చేయించడానికి వీల్లేదని చంద్ర తెలిపారు. కంపెనీలు తమకు నచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. అసంఘటితరంగ కార్మికుల పేర్ల నమోదుకు ఆన్‌లైన్ పోర్టల్ ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి రానున్నదని ఆయన తెలిపారు.
దేశంలో మారుతున్న అవసరాలు, పని సంస్కృతికి అనుగుణంగా ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. దీనిపై నిర్ణయానికి ముందు భాగస్వామ్య పక్షాలైన యాజమాన్యాలు, కార్మిక వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. నాలుగు రోజుల పని విధానాన్ని అమలులోకి తెస్తే మూడు రోజుల సెలవును వేతనంతో కూడినదిగా స్పష్టం చేయాలని కార్మిక సంఘాలు కోరాయని, అది తమ పరిశీలనలో ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నిటినీ నాలుగు స్మృతుల్లోకి క్రోడీకరిస్తున్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన బిల్లుల్ని కేంద్రం గత ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఈ ఏడాది జనవరిలో వీటిపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు సూచించింది. ఈ స్మృతులకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు అపూర్వచంద్ర తెలిపారు.