చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి దేశాన్ని గట్టెక్కించాలని ప్రభుత్వాధినేత గట్టిగా తలచుకుంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. తమ చర్యల వల్ల అవతలి పక్షం వారికి కలిగిన బాధను అర్థం చేసుకొని దానిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని అది పంపిస్తుంది. రెండు మాసాలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యమం నడుపుతున్న రైతు నేతలను మళ్లీ చర్చలకు ఆహ్వానిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు రాజ్యసభలో చేసిన ప్రసంగంలో అటువంటి లక్షణం మచ్చుకు కూడా కనిపించకపోడం బాధాకరం. ఈ ఘట్టానికి సామరస్య పూర్వక చర్చల ద్వారా తెర దించాలని ఆయన కోరుకోడం లేదేమో అనే అనుమానానికి తావు కలుగుతున్నది. రైతులు అంతటి చలిలో ఇంతటి సుదీర్ఘ ఆందోళన చేపట్టడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్తు బిల్లే కారణాలన్నది సుస్పష్టం. అవి సాగు రంగంలో ఎంతటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయదార్లకు మరెంతటి మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయని ఆయన నమ్ముతున్నప్పటికీ రైతులు మాత్రం అలా ఎంత మాత్రం అనుకోడం లేదు, వాటి వల్ల తమ బతుకులు నాశనమైపోతాయని భీతిల్లుతున్నారు.
అందుకే ఆయనే ప్రకటించినట్టు పంజాబ్ సహా చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు గత రెండు మాసాలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రశాంత నిరసన ఆందోళన చేస్తున్నారు. దానిని భగ్నం చేయడానికి ఎవరు ఎటువంటి కుయుక్తులు పన్నినా వెరవడం లేదు. రెట్టింపు ఉత్సాహంతో, సంఖ్యాబలాన్ని ఇంకా పెంచుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ‘గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాటికైనా చట్టాలను రద్దు చేయండి, అప్పటి వరకు ఈ దీక్షను ఇలాగే కొనసాగిస్తాం, మీరు మేకులు దించుతుంటే మేము పూలు పూయిస్తాం’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వానికి తెలియజేశారు. రైతు నేతలను ఉద్దేశిస్తూ వారు తప్పుదోవ పట్టారనే అరిగిపోయిన రికార్డు వంటి పాత అభిప్రాయంతోనే ప్రధాని ప్రసంగించడం శోచనీయం. అంతేకాదు వారి దీక్ష వెనుక అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యమాలు రగిలించడమే పనిగా బతికే ‘ఆందోళన జీవులు’ ఉన్నారని ప్రధాని అపహాస్యం చేశారు. వారు ఆందోళనల మీద ఆధారపడి బతికే పరాన్నజీవులు అన్నారు. విదేశీ కుట్ర శక్తుల హస్తముందన్నారు.
మన ప్రజాస్వామ్యం పాశ్చాత్య నమూనా కాదని, మానవీయ వ్యవస్థ అని కూడా ప్రకటించారు. ప్రజల నిరసన హక్కును ఉక్కు పాదంతోనో, నెలల తరబడి స్పందించకుండా ఉండడం ద్వారానో అణచివేయడమో, నీరుగార్పించడమో మాత్రమే మన ప్రజాస్వామ్య, జాతీయతల ఘన లక్షణాలని అనుకోవాలా? జాతీయత పేరుతో, సంస్కరణల ముద్రతో తాము ఎటువంటి జన హానికరమైన చట్టాలు తెచ్చినా, నిర్ణయాలు తీసుకున్నా వాటిని వీసమెత్తు ప్రశ్నించకుండా, కిమ్మనకుండా ప్రజలు వాటికి తలొగ్గడమే మన ప్రజాస్వామ్య గుణమని ఆయన చెప్పదలచుకున్నట్టు అర్థమవుతున్నది. అందుకే ప్రధాని ప్రసంగానికి రైతు నేతలు ఉబ్బితబ్బిబ్బు అయిపోలేదు. జరుగబోయే చర్చల పట్ల ఆశావహంగా మాట్లాడలేదు. సరే చర్చలకు వస్తాం, ముహూర్తం మీరే నిర్ణయించండి అని బంతిని ప్రభుత్వం కోర్టులోకే పంపించారు. ఇంతకు ముందు ఇదే వాతావరణంలో అనేక సార్లు చర్చలకు వెళ్లి విసిగిపోయిన అనుభవం వారికి ఉంది.
చర్చలకు వస్తామని చెప్పి ఆగిపోకుండా ‘ఆందోళన జీవులు’ అన్న ప్రధాని విమర్శకు తగిన సమాధానం కూడా రైతు నేతలు చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక్కసారైనా పాల్గొన్న చరిత్రలేని ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రధాని మోడీ ‘కార్పొరేట్ జీవి’ అని ఎదురు ఎద్దేవా చేశారు. ఆందోళన జీవులని ఆక్షేపించడం తమ ఉద్యమంలో ఇంత వరకు చనిపోయిన 200 మంది అమరులను అవహేళన చేయడమేనని అభిప్రాయపడ్డారు. కనీస మద్దతు ధరలు కొనసాగుతాయని చెబుతున్న ప్రధాని ఆ మేరకు చట్టం తీసుకు రాడానికి ఎందుకు వెనుకాడుతున్నారని రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు.
దీనిని గమనిస్తే రైతులను మళ్లీ చర్చలకు పిలుస్తూ ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన ప్రసంగం పరిస్థితి కుదుటపడడానికి ఉపయోగపడకపోగా రెండు పక్షాల మధ్య దూరాన్ని మరింతగా పెంచిందని అనిపించక మానదు. నోటితో పలుకరించి నొసటితో వెక్కిరించిన తీరుగా ఆయన ప్రసంగించారని అనిపిస్తే అందుకు ఎవరినీ తప్పు పట్టలేము. తాను దేశానికి సారథ్యం వహిస్తున్నానన్న విషయాన్ని గమనించి ఆయన రైతుల నిజాయితీని, నిబద్ధతను గుర్తించి గౌరవించవలసి ఉంది. వారు ఆందోళన విరమించుకొని ఇళ్లకు వెళ్లకపోడం తనను వ్యక్తిగతంగా సవాలు చేయడంగా ఆయన తీసుకోరాదు. తన ప్రజలను శత్రువులుగా భావించే వైఖరిని విడనాడవలసి ఉంది.