రిమోట్ సెన్సింగ్ పరికరాలతో ముందుకు వెళ్తున్న రెస్క్యూ బృందాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్నట్టు భావిస్తున్న 25-35మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు కేంద్ర, రాష్ట్ర రెస్కూ బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. బాధితులను గుర్తించేందుకు బుధవారం డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ పరికరాలను ఉపయోగించాయి. ఆదివారం ఆకస్మికంగా విరిగిపడిన మంచు చరియల వల్ల వచ్చిన వరదల్లో ఇప్పటి వరకు 30 మందిని రెస్కూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. 32 మృత దేహాలను రికవర్ చేశాయి. వీరిలో 8మందిని గుర్తించారు. వీరిలో ఇద్దరు ఉత్తరాఖండ్ పోలీసులు కూడా ఉన్నారు. మరో 174మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతైనవారిలో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సిబ్బంది, కార్మికులతోపాటు సమీపంలోని గ్రామాల ప్రజలున్నారు.
తపోవన్విష్ణుగడ్ ప్రాజెక్ట్ వద్ద నిర్మాణంలో ఉన్న 1500 మీటర్ల సొరంగంలో చిక్కుకున్న 25-35మంది కార్మికులను బయటకు తీయడమే రెస్కూ బృందాలకు సవాల్‌గా మారింది. బుధవారం 80 మీటర్ల వరకు సొరంగంలోకి రెస్కూ బృందాలు చొచ్చుకువెళ్లాయి. బురద, శిథిలాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరో 100 మీటర్ల వరకూ వెళ్తే బాధితులను చేరుకోవచ్చునని భావిస్తున్నారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్‌లో 600మంది ఆర్మీ, ఐటిబిపి జవాన్లు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, సహస్ర సీమాదళ్కు చెందినవారు పాల్గొంటున్నారు. మంగళవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ విపత్తు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషీమఠ్‌లోని ఐటిబిపి హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.