సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు
రైతుల పట్ల పార్లమెంటుకు, ప్రభుత్వానికి గౌరవం ఉంది
ప్రతిపక్షాలు కుట్రలతోనే నా ప్రసంగానికి అడ్డు తగులుతున్నాయి
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సాగు బిల్లులపై తమ అభిస్రాయాలను వ్యక్తం చేస్తున్న రైతుల పట్ల పార్లమెంటుకు, ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాదు, పాత వ్యవసాయ మార్కెటింగ్ విధానం కొనసాగాలని కోరుకునే వారు అలాగే కొనసాగించవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మూడు వివాదాస్పద సాగు చట్టాలను గట్టిగా సమర్థించడమే కాకుండా రైతులును తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలపైనా విరుచుకు పడ్డారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడాన్ని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు ఒక పథకం ప్రకారం సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాయని ఆయన అన్నారు. ‘ఇలాంటి కుతంత్రాల ద్వారా వారు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’ అని ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోడీ అన్నారు. దాదాపు 90 నిమిషాల తన ప్రసంగంలో ప్రధాని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలతో పాటుగా గందరగోళం కూడా నెలకొందని, తన మేలు కోసం తాను చేసుకోవడం కానీ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచించడం కానీ చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సాగు చట్టాల వల్ల ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సాగు చట్టాల వల్ల దేశంలో ఎక్కడైనా ఒక్క మండీ అయినా మూతపడిందా? సాగు చట్టాలవల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర లభించలేదా? అని ప్రశ్నించారు. వాస్తవానికి కనీస మద్దతు ధర పెరిగింది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరన్నారు. సభలో కొందరు కావాలనే తన ప్రసంగాన్ని అడ్డుకొంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకు కూడా నష్టం జరగదన్నారు. రైతులకు నష్టం జరిగే చట్టాలను ఎందుకు చేస్తాం? సాగు చట్టాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
మరోవైపు, సాగు చట్టాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభనుంచి వాకౌట్ చేసింది. ‘దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరం. సమాజంలో మార్పు కోసం మరిన్ని చట్టాలు తేవలసిన అవసరం ఉంది. కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టం. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ఒకలా.. రాజ్యసభలో మరోలా ప్రవర్తిస్తోంది. ఈ చట్టాలపై కాంగ్రెస్ నేతలు గందరగోళంలో ఉన్నారు. సమాజంలో మార్పుకోసం, ప్రగతి కోసం ఎందరో కృషి చేశారు. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో ఏ నిర్ణయానికైనా వందశాతం ఆమోదం రాదు. ఎక్కువ మందికి లబ్ధి కలిగించే నిర్ణయాలను తీసుకోవాలి. పాత వ్యవసాయ మార్కెటింగ్ విధానం కొనసాగుతుంది. కొత్త విధానం అక్కరలేదనుకునే వారు పాత విధానంలోనే కొనసాగవచ్చని ప్రధాని అన్నారు. 21వ శతాబ్దంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను 18వ శతాబ్దపు ఆలోచనలతో పరిష్కరించడం సాధ్యం కాదని మోడీ అన్నారు. మనం దీన్ని మార్చాలని స్పష్టం చేశారు. జీవించే హక్కును ఇవ్వని పేదరికం చక్రబంధంలో రైతులు మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరన్నారు. రైతులు ఇతరులపై ఆధారపడకూడదని తాను గట్టిగా కోరుకుంటున్నానన్నారు. ఎవరు అడిగారని కొత్త చట్టాలను తీసుకువస్తున్నారనే వాదనను తీసుకు వస్తున్నారని, అంగీకరించడమైనా, తిరస్కరించడమైనా ప్రజల చేతుల్లో ఉంటుందని, దీనిలో నిర్బంధం ఏమీ లేదని ప్రధాని అన్నారు. వరకటానికి వ్యతిరేకంగా చట్టం చేయాలని ఎవరూ అడగలేదన్నారు. అయినా దేశం ప్రగతి సాధించడం కోసం ఆ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. అలాగే ట్రిపుల్ తలాక్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలనే దేశాభివృద్ధి కోసమే చేసినట్లు చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్
కరోనా మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచానికే భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచ దేశాల్లో మన దేశానికి ప్రాధాన్యం బాగా పెరిగింది. మన దేశం వైవిధ్యానికి మారు పేరు. వైవిధ్యంలోను మనం ఏకతాటిపై నడుస్తున్నాం. కరోనా వేళ మనం ప్రపంచానికి దిక్సూచిగా మారాం. ప్రపంచ ప్రజలంతా బాగుండాలని కోరుకునే దేశం మనది.ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోంది. ఆ దిశగా వెళ్లేందుకు ఆత్మనిర్భర్ భారత్ నినాదం తీసుకువచ్చాం. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఆత్మనిర్భర్ సాధించాం. కరోనా సమయంలో ప్రపంచం కనిపించని శత్రుతో పోరాటం చేసింది.130 కోట్ల ప్రజల సంకల్ప శక్తితో కరోనా సంక్షోభాన్ని మనం ఎదుర్కొన్నాం. దేవుడి దయవల్ల కరోనా కష్టాలనుంచి మనం బైటపడ్డాం. దేవుడి రూపంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు వచ్చారు. కరోనా పోరుతో దేశ ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. లాక్‌డౌన్, కర్ఫూలవల్ల అనేక ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో 75 కోట్ల మందికి ఎనిమిది నెలల పాటు రేషన్ సరకులు ఇచ్చాం. ఆధార్. జనఃధన్ ఖాతాల వల్ల కోట్లాది మందికి ప్రయోజనం కలిగింది’ అని ప్రధాని అన్నారు.
PM Modi Reply to Motion of Thanks on President’s Speech