వెల్లడించిన రష్యన్ వార్తా సంస్థ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు, 45 మంది చైనా సైనికులు మరణించారని టాస్ బుధవారం తెలిపింది. కాగా..గల్వాన్ ఘర్షణలలో తమ దేశానికి చెందిన సైనికులు ఎందరు మరణించారన్న విషయాన్ని చైనా ఇప్పటివరకు వెల్లడించలేదు. కాగా..భారత్ మాత్రం సంఘటన జరిగిన తర్వాత 20 మంది భారతీయ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అమెరికాతోసహా కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థలు వెల్లడించిన సమాచారాన్ని, కొన్ని మీడియా వార్తలను క్రోడీకరించి రష్యా వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలిపింది.
కాగా, గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారని అప్పట్లో వచ్చిన వార్తలను తప్పుడు వార్తలుగా చైనా వర్ణించింది. 2020 మే, జూన్ మధ్య గల్వాన్ లోయలో చైనా, భారతీయ సైనిక దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 20 మంది భారతీయ సైనికులు, 45 మంది చైనా సైనికులు మరణించారని టాస్ తెలిపింది. నిస్సైనికీకరణ ఒప్పందానికి అనుగుణంగా సైనికులను ఉపసంహరించడానికి చైనా నిరాకరించడంతో గత ఏడాది జూన్ 15న భారత, చైనా సైనిక దళాల మధ్య మూడు వేర్వేరు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత సరిహద్దులను రక్షించే క్రమంలో 16 బీహార్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా పలువురు భారతీయ సైనికులు మరణించారు.