ఐటిఐఆర్ ప్రాజెక్టుపైన బిజెపిది అసత్య ప్రచారం
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాం
రెండు సార్లు కేంద్రానికి డిపిఆర్‌లను ఇచ్చాం
10 సార్లు కేంద్రానికి ఐటిఐఆర్‌పై ప్రత్యేకంగా లేఖలు రాశాం
కేంద్రానికి ఎలాంటి సమాచారం రాలేదని పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రి సంజయ్ దోత్రే
అసత్యాల ఆధారంగా దుష్ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు తమ వైఖరి మార్చుకోవాలన్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఐఆర్ ప్రాజెక్టుపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను సైతం తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర మంత్రులు సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. ఐటిఐఆర్ ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురావాలనే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే టిఆర్ఎస్ ప్రభుత్వా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ నెలలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ఒక లేఖ సైతం రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తదనంతరం కనీసం 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో లేఖల ద్వారా అడిగామన్నారు. అలాగే అనేక సార్లు ప్రత్యక్షంగా కలిసి ఐటిఐఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు.
ఇదే అంశంపై గురువారం బిజెపి ఎంపి బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటి శాఖ మినిస్టర్ ఫర్ స్టేట్ సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానం పూర్తిగా సత్యదూరమని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఐటిఐఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం, లోక్ సభను తప్పుదోవ పట్టించడమే అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్రం అడిగినా పూర్తి సమాచారంతో పాటు డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) లను సైతం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. ఆ తర్వాత ఐటిఐఆర్‌కు సంబంధించి అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని సైతం కేంద్ర మంత్రి దాచిపెట్టారని కెటిఆర్ అన్నారు.
గత హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం ఐటిఐఆర్పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం సమర్పించలేదన్న మాట చెప్పినప్పుడు, 2016లో తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వెళ్ళిన ప్రతి సమాచారాన్ని అందించి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన డిపిఆర్‌ను సైతం అందించానన్నారు. కనీసం ఇప్పుడైనా ఐటిఐఆర్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న దత్తాత్రేయ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళతామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా మంత్రి కెటిఆర్ ఉదహారించారు.
దీనిపై స్థానిక బిజెపి నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సైతం అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కెటిఆర్ విమర్శించారు. 2014 జూన్ నెల నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐటిఐఆర్ పైన సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటి పరిశ్రమకు మరింత ఊతం అందించాలని పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తి ప్రజల దృష్టిలో ఉన్నదని మంత్రి అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఐటిఐఆర్ కు సంబంధించిన డిపిఆర్‌లను సమర్పించిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిలన్నింటినీ బుట్టదాఖలు చేసిన కేంద్రం పూర్తిగా ఐటిఐఆర్ ని రద్దు చేసిందన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలోనూ ఐటిఐఆర్‌ను రద్దు చేయాలన్న బిజెపి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని స్థానిక బిజెపి నాయకులు గుర్తించాలని అన్నారు. కేవలం అసత్యాలు, దుష్ప్రచారంతో ప్రజలను ఎల్లకాలం మభ్య పెట్టాలనే బిజెపి వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారని అని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.
BJP false propaganda on ITIR project says KTR