Sunday, November 24, 2024

రెండు విజయాలకే ఇంత నీలుగుడా?

- Advertisement -
- Advertisement -

 నిన్న, ఇయ్యాల పుట్టినవారు స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారు
 సిఎం కెసిఆర్ త్యాగాలను, వయసును గుర్తించకుండా మాట్లాడుతున్నారు
 మేం కూడా ప్రధాని, కేంద్రమంత్రులపై అలాగే మాట్లాడగలం 
 మా ఓపికకూ ఓ హద్దుంది: సిరిసిల్లలో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్ నిప్పులు

మన తెలంగాణ/సిరిసిల్ల: మా ఓపిక, సహనానికి ఓ హద్దుంది, సిఎం కెసిఆర్ త్యాగాలను, ఆయన వయస్సును గుర్తించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే తాము కూడా ప్రధాని, కేంద్ర మంత్రులను కూడా వదలకుండా మాట్లాడతామని, సమయం, సందర్భం వస్తే తన్ని తరిమేస్తామని మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు బిజేపి, కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పలువురికి లాంఛనంగా సభ్యత్వాలను అందించారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ నిన్న, ఇవ్వాల పుట్టిన నాయకులు తమ స్థాయిని మరిచి ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గుర్తించకుండా మాట్లాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. తెలంగాణ రాకముందు తెలంగాణలోని కాంగ్రెస్, బిజేపి నాయకులు సీమాంధ్ర నేతల ముందు చేతులు కట్టుకుని నిల్చునేవారని, టి కాంగ్రెస్ పార్టీ, టి బిజేపి పార్టీ ఎక్కడిదని, మీకు పదవులు ఎక్కడివి అని కెటిఆర్ ప్రశ్నించారు. మీవో దిక్కుమాలిన బతుకులు, ఇవ్వాల మీకో అస్థిత్వం ఉందంటే అది కెసిఆర్, తెరాస పెట్టిన భిక్ష అని ఎద్దేవా చేశారు. రెండు ఎన్నికల్లో గెలువగానే ఇంతనీలుగుడు వస్తే, తెలంగాణలోని 32 జడ్‌పిలకు 32 జడ్‌పిలు, 130 మున్సిపాలిటీల్లో 122 మున్సిపాలిటీలు, 12 వేల గ్రామపంచాయతీల్లో 9500 గ్రామపంచాయతీలు కైవసం చేసుకుని దాదాపు 90 శాతం విజయం సాధించిన తామెంత నీలుగాలో చెప్పండన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఉన్న అన్ని జడ్‌పిలను కైవసం చేసుకున్న పార్టీ ఒక్కటైనా ఉందా అన్నారు. చిన్న విజయాలకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే ఎలా అన్నారు. తాము మాట్లాడనంత మాత్రాన తమను అసమర్ధులుగా భావిస్తే సహించేది లేదన్నారు. గత 20 సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని, అనేక గెలుపు ఓటములు చవి చూసిందని అయినా ఎత్తిన జెండా దించకుండా లక్షం సాధించినట్లు కెటిఆర్ స్పష్టం చేశారు.

టిఆర్‌ఎస్ ఉంటేనే మీ (కాంగ్రెస్, బిజేపి) ముఖాలకు విలువ ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో మీ బతుకులేంటో తెలుసని, సీమాంధ్రులు మిమ్మల్ని గంజిలో ఈగల్ని తీసేసినట్లు తీసేసిన విషయం మర్చిపోయారా, సీమాంధ్రులకు జీ హుజూర్ అంటూ గులాంగిరి చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామాలు చేయమంటే కాంగ్రెస్, బిజేపి నాయకులు ఫరారైన విషయం ప్రజలకు తెలియదా అన్నారు. ఆనాటి చీకటి పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిరుదివ్వెలా మిగిలినందువల్లే తెలంగాణ సాధ్యపడిందన్నారు.్ర పొఫెసర్ జయశంకర్ చెప్పినట్లు ఎట్టిపనికైనా, మట్టిపనికైనా మనోడే ఉండాలన్నారు. జాతీయ పార్టీలుగా 28 రాష్ట్రాలను సమానమనే కాంగ్రెస్, బిజేపి ల్లాగా టిఆర్‌ఎస్ ఉండదని, టిఆర్‌ఎస్‌కు తెలంగాణ రాష్ట్ర అస్థిత్వం, ప్రయోజనాలే ముఖ్యమని, నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం టిఆర్‌ఎస్ పనిచేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణకు టిఆర్‌ఎస్ శ్రీరామరక్ష అన్నారు. కులమతాల పేరిట కుంపట్లుపెట్టి, తాత్కాలిక ఉద్వేగాలతో ప్రయోజనం పొందాలనుకునేవారిలాగా కాకుండా అభివృద్ధ్ధి సంక్షేమంతో మనకు జాతీయ, అంతర్జాతీయంగా వన్నె తెచ్చిన సిఎం కెసిఆర్‌ను మరిచిపోవద్దన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఒక సందర్భంలో ఉద్యమ పార్టీలు ఆందోళన చేస్తాయి కాని అడ్మినిస్ట్రేషన్‌లో విఫలమవుతాయని అనుకున్నానని, అయితే టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ మాత్రం ఉద్యమంతో పాటుగా మంచి అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొందారని కితాబిచ్చారన్నారు. కేంద్రమంత్రులు, కేంద్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రశంసిస్తారు, కితాబులిస్తారు. ఆ విషయాలు ఇక్కడి సన్నాసులకు మాత్రం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

గతంలో తెలంగాణలోని వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్, ప్లోరోసిస్ ఉందని, ఇప్పుడు పోయిందని కేంద్రం ప్రకటిస్తే స్థానిక నేతలకు అర్థం కాదన్నారు. తమ పార్టీపై సోషల్ మీడియాలో జరిగే విష ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తమ పార్టీలో సుశిక్షితులైన యువకులతో మీడియా వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వాల విషయంలో మనోడు, మందోడు అనే భేషజాలు వదిలి అందరికి సభ్యత్వాలు ఇవ్వాలన్నారు. సభ్యత్వ సేకరణ ఫిబ్రవరి నెలాఖరు వరకు సాగుతుందన్నారు. మార్చిలో మండల, గ్రామ, పట్టణ, జిల్లా కమిటీల పునర్నిర్మాణం పూర్తి చేసి, ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తా మన్నారు. పార్టీ కన్నతల్లిలాంటిదని, పదవులు శాశ్వతం కాదన్నారు. ప్రజలకు, పార్టీకి మధ్య కార్యకర్తలు వారధుల్లా పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి అరుణ, ఎంసిపిలు మాధవి, కళ, తెరాస జిల్లా ఇంచార్జీలు కర్ర శ్రీహరి, బండి రమేశ్, గూడూరి ప్రవీణ్, తోట ఆగయ్య, చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, జిందం చక్రపాణి, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, దోర్నాల లకా్ష్మరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News