Friday, November 15, 2024

కార్మికుల ఆచూకీ కోసం సొరంగంలోకి కెమెరా

- Advertisement -
- Advertisement -

కార్మికుల ఆచూకీ కోసం సొరంగంలోకి కెమెరా
డ్రిల్లింగ్ చేసిన రంధ్రం వెడల్పు చేసేందుకు చర్యలు
తపోవన్ ప్రాజెక్టు వద్ద సహాయక చర్యలు ముమ్మరం

జోషీమఠ్(ఉత్తరాఖండ్): మంచు చరియలు విరిగిపడిన ఫలితంగా హఠాత్తుగా వచ్చిన వరదలకు తపోవన్ జల విద్యుత్ ప్రాజక్టుకు చెందిన సొరంగం బురద మన్ను, శిథిలాలతో కూరుకుపోవడంతో అందులో చిక్కుకుపోయిన 30 మందికి పైగా కార్మికుల ఆచూకీ కనుగొనేందుకు భారీ యంత్ర సాయంతో డ్రిల్లింగ్ చేసిన సహాయక సిబ్బంది శనివారం ఆ రంధ్రాన్ని వెడల్పు చేసే చర్యలు ప్రారంభించారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు మూడు అంచెల వ్యూహాన్ని చేపట్టామని ఎన్‌టిపిసికి చెందిన తపోవన్-విష్ణుగఢ్ హైడల్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఆర్‌పి అహిర్వాల్ శనివారం విలేకరులకు తెలిపారు. శుక్రవారం డ్రిల్ చేసిన రంధ్రాన్ని ఒక అడుగు వెడల్పు చేస్తున్నామని, కార్మికులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు బురద నీరు విరజిమ్ముతున్న సొరంగంలోని ప్రదేశానికి కెమెరాను, పైపును పంపించే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కార్మికులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుందని, సొరంగంలో ఉన్న బురదనీటిని ఈ పైపు ద్వారా బయటకు లాగుతారని ఆయన వివరించారు. సొరంగాలలోకి నిరంతరాయంగా బురదనీరు ప్రవహిస్తున్న ఎన్‌టిపిసి బ్యారేజ్‌లో బురదనీటిని తోడెయ్యడం, వరదల కారణంగా ఎడమ వైపు మళ్లిన ధౌలిగంగ నది ప్రవాహాన్ని కుదివైపుకు మరల్చడం వంటివి ఇతర వ్యూహాలని ఆయన చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ ప్రధాన ప్రాధాన్యతగా ఆయన ప్రకటించారు. ఇందుకోసం వందమందికి పైగా తమ శాస్త్రవేత్తలను రంగంలోకి దింపామని ఆయన తెలిపారు.

సొరంగంలో కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి సహాయక సిబ్బందిని పంపించే ప్రయత్నాలు చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు అందుకోసం రంధ్రాన్ని మరింత పెద్దగా చేయవలసి ఉంటుందని, అవసరమైతే ఆ పని కూడా చేస్తామని ఆయన తెలిపారు. 100 మందికి పైగా ఎన్‌టిపిసి శాస్త్రవేత్తలు కార్మికులను రక్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని, వాటిని అమలు చేయడమే తమ తక్షణ కర్తవ్యమని అహిర్వాల్ చెప్పారు. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి, సిబ్బంది, వనరులు అన్నీ ప్రాజెక్టు స్థలి వద్దనే అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ధౌలిగంగ నది ప్రవాహాన్ని పూర్వ స్థితికి తీసుకురావడానికి భారీ యంత్రాల సహాయంతో ఇప్పటికే చేపట్టామని, ఇప్పటి వరకు 38 మృతదేహాలు లభించాయని, మరో 166 మంది ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని ఆయన తెలిపారు.
గత ఆదివారం సంభవించిన మెరుపు వరదల్లో కొట్టుకుపోయిన 11 మృతదేహాలను గుర్తించడం జరిగిందని డిఐజి నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. వరదల తాకిడికి గురైన ప్రాంతాల నుంచి 11 మృతదేహాల శరీర భాగాలు లభించాయని, డిఎన్‌ఎ నమూనాలు తీసుకుని వాటిని దహనం చేశామని ఆయన చెప్పారు.

Camera into Tapovan tunnel for locating workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News