చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ రవీచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ టాప్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసి గట్టి దెబ్బ కొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ ఫోక్స్(42 నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ కూడా 30 పరుగులకు మించి స్కోరు సాధించలేకపోయారు. ఓలీ పోప్(22), బెన్ స్టోక్స్(18), డామినిక్ సిబ్లే (16), డానియల్ లారెన్స్(09), జోయ్ రూట్(06), మోయిన్ అలీ(06), ఓలీ స్టోన్ (01)లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక, రోరీ బర్న్, స్టువర్ట్ బ్రాడ్ లు పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 195 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ బౌలర్లలో రవీచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అక్షర పటేల్, ఇషాంత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మాద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయ్యిన విషయం తెలిసిందే.
England All Out 134 Runs in 1st Innings against India