Monday, November 25, 2024

అశ్విన్ మాయాజాలం.. ఇంగ్లాండ్ విలవిల

- Advertisement -
- Advertisement -

Team India with huge lead of 249 runs

134 పరుగులకే ముగిసిన తొలి ఇన్నింగ్స్
249 పరుగులు భారీ ఆధిక్యతలో టీమిండియా

చెన్నై: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తిగా పై చేయి సాధించింది. తొలి రోజు బ్యాట్‌తో చెలరేగిన టీమిండియా రెండో రోజు బంతితో విజృంభించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/43)స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఫోక్స్ చేసిన 42 పరుగులే టాప్ స్కోరు కావడం గమనార్హం. అనంతరం 195 పరుగుల భారీ ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులతో నిలిచింది. మొత్తగా ప్రత్యర్థికన్నా 249 పరుగుల ఆధిక్యతలో నిలిచింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (25), పుజారా (7) పరుగులతో ఉన్నారు.

అంతకు ముందు 6 వికెట్ల నష్టానికి 300 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 29 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే మొయిన్ అలీ అక్షర్ పటేల్ (5), ఇశాంత్ శర్మ(0)ను సట్ చేసి దెబ్బతీశాడు. అనంతరం పంత్ బౌండరీలే లక్షంగా చెలరేగి పోయాడు. కుల్దీప్‌కు ఎక్కువ స్ట్రైక్ ఇవ్వకుండా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అయితే పంత్‌కు సహచరులనుంచి ఎక్కువ సేపు సహకారం లభించలేదు. కుల్దీప్(0),సిరాజ్(4)లను స్టోన్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ లంచ్ సమయానికే 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఓవర్‌లోనే బర్న్‌ను ఇశాంత్ ఔట్ చేయగా, ఆ తర్వాత సిబ్లీని అశ్విన్, ప్రమాదకర బ్యాట్స్‌మన్ రూట్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశారు. తొలి సెషన్ చివరి బంతికి డేనియల్‌ను అశ్విన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే అశ్విన్ అద్భుతమైన బంతితో బెన్‌స్టోక్స్‌ను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అయితే పోప్(22)తో కలిసి ఫోక్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిదేద ప్రయత్నం చేశాడు.

వీరిద్దరూ కాసేపు మరో వికెట్ పడకుండా భారత బౌలర్లను ప్రతిఘటించారు. అయితే డ్రింక్స్ బ్రేక్ తర్వాత సిరాజ్ తొలి బంతికే పోప్‌ను ఔట్ చేసి దెబ్బతీశాడు. ఆతర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. అయితే ఆ జట్టు ఫాలోఆన్ తప్పించుకోవడానికి ఫోక్స్ పోరాటమే కారణం. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా, ఇశాంత్ శర్మ, అక్షర్ పటేల్‌లు చెరి రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ధాటిగా ఆడారు. అయితే జట్టు స్కోరు 42 పరుగుల వద్ద గిల్‌ను లీచ్‌ఔట్ చేశాడు. గిల్ సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అనంతరం వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా జాగ్రత పడ్డాడు.

66 ఏళ్ల రికార్డు బ్రేక్

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు సాధించడం ద్వారా రికార్డు సృష్టించింది. ఈ మొత్తం పరుగులు భారత ఆటగాళ్లు సాధించినవే కావడం విశేషం. ఇందులో ఒక్క ఎక్స్‌ట్రా పరుగు కూడా లేదు. ఫలితంగా ఒక ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా పరుగు ఇవ్వకుండా అత్యధిక స్కోరు అందించిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. దీంతో 66 ఏళ్లుగా భారత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.1955లో లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఒక్క ఎక్స్‌ట్రా ఇవ్వకుండా 328 పరుగులు ఇచ్చింది. ఆ రికార్డును ఇప్పుడు ఇంగ్లాండ్ బ్రేక్ చేసింది. కేవలం ఒక్క పరుగు ఎక్కువ ఇవ్వడంతోనే ఈ రికార్డు రావడం గమనార్హం.

అశ్విన్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 5 వికెట్లు సాధించడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 5 వికెట్లు తీయడం ఓవరాల్‌గా 29వ సారి కాగా, స్వదేశంలో 23వ సారి ఈ ఫీట్‌ను సాధించాడు. అశ్విన్ స్వదేశంలో 45 టెస్టుల్లో 23సార్లు 5 వికెట్ల ఫీట్‌ను అందుకోగా, అంతకు ముందు శ్రీలంకకు చెందిన మురళీధరన్(45 సార్లు), రంగన హెరత్ (26 సార్లు), అనిల్ కుంబ్లే (25సార్లు) స్వదేశంలో 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నారు.

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ స్వదేశంలో 89 టెస్టులు ఆడి 22 సార్లు 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో పాటుగా అశ్విన్ మరో అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 200 మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లను ఔట్ చేసిన తొలి క్రికెటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.కాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 5 వికెట్లు తీయడం ద్వారా హర్భజన్ సింగ్‌ను అధిగమించి స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. స్వదేశంలో 45 టెస్టులాడిన అశ్విన్ 268 వికెట్లు తీశాడు.62 టెస్టుల్లో 350 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు.

ప్రధాని ట్వీట్

చెన్నై: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుఉతన్న రెండో టెస్టుపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘ఇంట్రస్టింట్’ అంటూ ఆ ట్వీట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. చెన్నైలోని పలు ప్రాజెక్టులను ఆదివారం ప్రారంభించేందుకు విమానంలో వెళ్లిన ప్రధాని చిదంబరం స్టేడియం మీదుగా వెళ్లారు. ఈ క్రమంలో చేపాక్ స్టేడియం ఫొటో తీసి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చెన్నై స్టేడియంలో జరుగుతున్న రసవత్తర మ్యాచ్‌ని ఆకాశంనుంచి చూశాను’అంటూ మోడీ ట్వీట్ చేశారరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News