మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై జులుం
భోపాల్ : ఇదన్నమాట మహిళా సాధికారత. ఆడపడుచులకు గ్రామీణ ప్రాంతాల్లో దక్కుతున్న ఆదరణ. మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో ఓ అత్యంత ఆటవిక , దారుణ ఘటన జరిగింది. ఓ ఆదివాసీ మహిళ తన భుజాలపై అత్తింటికి చెందిన ఓ మగోడిని ఎత్తుకుని మూడు కిలోమీటర్లు నడిచింది. చుట్టూ కర్రలు, క్రికెట్ బ్యాట్లు పట్టుకుని ఉన్నవారు ఆమెను గోవును తరిమినట్లు తరుముతూ ఉండగా ఈ ఆదివాసి అమ్మ కాలికి పనిచెప్పాల్సి వచ్చింది. భుజాలపై అత్తింటి బరువు మోసింది. ఆమెను కొందరు కర్రలతో బాదారు. చోద్యం చూస్తూ పగలబడి నవ్వారు. వివాహిత జిల్లాలోని సగాయ్ నుంచి బన్స్‌ఖేడీ గ్రామాల మధ్య నడయాడింది. ఆమె కదలిక ఆగినప్పుడల్లా కర్ర దెబ్బలు తింది.
తాను భర్త అంగీకారంతోనే ఆయన నుంచి విడిపొయ్యానని, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నానని , దీనిని ఆసరాగా చేసుకుని గత వారం ఆమెమాజీ భర్త కుటుంబ సభ్యులు ఇతరులు గత వారం ఆమెఇంటికి వచ్చారు. ఆమెను ఎత్తుకువెళ్లారు. తరువాత ఆమెను ఈ విధంగా అవమానించారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి దర్యాప్తు చేపట్టారు. కొందరిని అరెస్టు చేశారని వెల్లడైంది. అయితే గిరిజన లంబాడీ తెగలలో కట్టుబాట్లు ఇట్లానే ఉంటాయని, కట్టు తప్పిన ఆడవారిని అంతా చూస్తూ ఉండగా ఈ విధంగా హింసించి అవమానించి వదిలిపెట్టడం, వారు తమ బతుకు తాము వెళ్లదీయడం రివాజు అని కొందరు స్థానిక పెద్దలు తెలిపారు.