బాధితురాలికి క్షమాపణ చెప్పిన ప్రధాని
కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా వివాదంలో చిక్కుకుంది. పార్లమెంట్ లోని రక్షణశాఖ కార్యాయంలో తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ ఆరోపించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి కొంతమంది ఉన్నతాధికారులు ప్రయత్నించారని, దీనిపై ఫిర్యాదు చేయవద్దని తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కలకలం రేపడంతో ప్రధాని స్కాట్ మారిసన్ స్వయంగా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన 2019 లో జరిగింది. రక్షణ శాఖ మంత్రి లిండా రీనాల్డ్ కార్యాలయంలో అధికారిక లిబరల్ పార్టీకి చెందిన తన సహోద్యోగి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. రక్షణ మంత్రి లిండా తనకు ఈ సంఘటనపై ఫిర్యాదు అందిందని అంగీకరించారు. ఫిర్యాదు చేయవద్దని ఆమెపై ఎవరూ ఒత్తిడి తేలేదని వివరించారు. ఆరోజు రాత్రి పార్టీ చేసుకున్న సందర్భంగా ఈ దారుణం జరిగిందని బాధితురాలు చెప్పగా, పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.