నేడే ఐపిఎల్ మినీ వేలం
అందరి దృష్టి స్మిత్, మలన్‌పైనే..
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021కు సర్వం సిద్ధమైంది. చెన్నై వేదికగా గురువారం ఐపిఎల్ మినీ వేలం పాట జరుగనుంది. ఈ వేలం పాటలో 292 మంది క్రికెటర్ల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈసారి వేలం పాటలో 164 మంది భారత క్రికెటర్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈసారి జరిగేది చిన్న వేల మే అయినా ఇందులో పలువురు స్టార్ క్రికెటర్లు ఉండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్లు స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్‌లతో పాటు ఇంగ్లం డ్ విధ్వంసక బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. దీంతో అఫ్గానిస్థాన్‌కు చెందిన స్టార్ స్పిన్నర్ ముజీబుర్ రహ్మాన్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. కిందటి ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన మాక్స్‌వెల్‌ను ఈసారి ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. దీంతో మాక్స్‌వెల్‌ను సొంతం చేసుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. కిందటి సీజన్‌లో మాక్స్‌వెల్ పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. అయితే వేలం పాటలో అతనికి పెద్ద మొత్తం ధర లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్‌కు సారధిగా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌ను కూడా ఆ ఫ్రాంచైజీ వదిలించుకుంది. దీంతో స్మిత్ కూడా ఈ వేలం పాటకు ప్రధాన ఆకర్షణగా తయారయ్యాడు. అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్మిత్ ఈసారి భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయమనే చెప్పాలి. ఆరోన్ ఫించ్‌పై కూడా ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి సారించాయి. కిందటి ఐపిఎల్‌లో ఫించ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతన్ని బెంగళూరు తొలగించింది. దీంతో ఫించ్ కూడా వేలం పాటలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మలన్ కోసం తీవ్ర పోటీ…
మరోవైపు ఇంగ్లండ్ సంచలన బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ ఈ వేలం పాటకే ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూ.1.5 కోట్ల కనీస ధరతో అతను బరిలోకి దిగుతున్నాడు. పరిస్థితులు చూస్తుంటే మలన్ పది కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉంది. అంతర్జాతీయ ట్వంటీ20లో డేవిడ్ మలన్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పటకే 149.48 స్ట్రైక్‌రేట్‌తో 855 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు కూడా డిమాండ్ ఏర్పడింది. అతన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇటు బ్యాట్‌తో అటు బంతితో ఫలితాన్ని తారుమారు చేసే సత్తా మోరిస్‌కు ఉంది. ఈసారి అతన్ని బెంగళూరు వదులుకుంది.
Mini IPL Auction in Chennai Tomorrow