Monday, November 25, 2024

నూటికి పడగెత్తిన పెట్రోల్

- Advertisement -
- Advertisement -

Petrol, Diesel and Gas prices are on rise in country

 

దేశంలో పెట్రోల్, డీజెల్, వంట గ్యాస్ ధరలు అదే పనిగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎన్నడూ ఎరుగనంతగా అధిక ధరల భారాన్ని మోయలేక మోస్తున్నారు. మాసాల తరబడి సాగిన కొవిడ్ 19 లాక్‌డౌన్ సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే వీటి ధరలు విపరీతంగా పెరిగిపోడంతో జీవన వ్యయం అపరిమితమైపోయింది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే వంద రూపాయలకు చేరుకున్నది. మిగతా దేశంలోనూ ఆ స్థాయికి అతి దగ్గరలో తాండవిస్తున్నది. ఈ ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే అధికారం చేతిలో ఉన్నప్పటికీ దానిని ప్రయోగించకుండా కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు అసాధారణమైన మౌనాన్ని పాటిస్తూ వచ్చారు. ఆర్తనాదాలు మిన్నంటడంతో గత్యంతరం లేక పెద్దలు ఒక్కొకరూ పెదవి విప్పుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి మాట్లాడుతూ మొత్తం బాధ్యతను గత ప్రభుత్వాల మీదికి తోసేశారు. మన ఇంధన అవసరాలకు చిరకాలంగా దిగుమతుల మీదనే ఆధారపడుతుండడం వల్ల ఇప్పుడీ దుస్థితి తలెత్తిందన్నారు.

గత ప్రభుత్వాలు దిగుమతులను పరిమితం చేసి ఉంటే మధ్య తరగతి ప్రజానీకం పెట్రోల్ ధరల మంటలకు ఇప్పుడిలా దొరికిపోయి ఉండేవారు కాదన్నారు. గత ప్రభుత్వాలు అంటే ఆయన ఉద్దేశం 2014కి ముందు దేశాన్ని పాలించిన యుపిఎ ప్రభుత్వం, దాని పాలకులన్నది సుస్పష్టం. అప్పటి నుంచి గత ఏడేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న తాము క్రూడాయిల్ దిగుమతులను ఎందుకు తగ్గించలేకపోయారు అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు. అమెరికాలో మాదిరిగా మొక్కజొన్న, చెరకు వంటి పంటల నుంచి తీసే ప్రత్యామ్నాయ (ఎథనాల్) ఇంధన ఉత్పత్తి మీద మనం తగినంత శ్రద్ధ చూపుతున్న జాడలు లేవు. ఇందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. మన దేశంలోని రిఫైనరీలు శుద్ధి చేస్తున్న ఆయిల్‌ను ఎగుమతి చేసుకొని అవి సొమ్ము చేసుకుంటున్నాయి. అటువంటి వనరులను దేశీయ వినియోగానికే మళ్లిస్తే దిగుమతలపై ఇంతగా ఆధారపడవలసి ఉండేది కాదు. పెట్రోల్, డీజెల్ ఇంధనాలకు గతంలో నియంత్రిత ధర ఉండేది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర అపరిమితంగా అసాధారణ స్థాయికి పెరిగిపోయినప్పుడు దాని దిగుమతికయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా భరించేది. మొత్తం ధర ప్రజల నెత్తిన పడకుండా అడ్డు చక్రం వేసేది. ఆ పద్ధతిని తొలగించి అనియంత్రిత ధరల విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరను బట్టి దేశంలో పెట్రోల్, డీజెల్ ధరల్లో తరచూ మార్పులు సంభవించడం మొదలైంది. అయితే ప్రపంచ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పతనమైనప్పుడు ఆ మేరకు దేశంలో ధరలు తగ్గిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. గత ఏడాది మార్చిలో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఎన్నడూ లేనంతగా 27.10 డాలర్లకు పడిపోయింది. 1991 తర్వాత క్రూడ్ ధర ఆ విధంగా తగ్గిపోడం అదే మొదటిసారి. మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర గతేడాది ఏప్రిల్‌లో 50 శాతం తగ్గిపోయి బ్యారెల్ 26 డాలర్లకు పతనమైంది.

అప్పుడు కూడా ఆ మేరకు ఇక్కడ ధరలు తగ్గలేదు. ప్రపంచ మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు ఆదా అయిన క్రూడాయిల్ ఖర్చు విత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకొని అక్కడ పెరిగినప్పుడల్లా ఆ మేరకు భారాన్ని ప్రజల మీద పడేస్తున్నది. ఇది తాను ప్రవేశపెట్టిన అనియంత్రిత ధరల వ్యవస్థ ధర్మాన్ని కూడా దారుణంగా అతిక్రమించడమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ఈ అంశంపై మాట్లాడుతూ చమురు ధరలకు స్వేచ్ఛను కల్పించినందున ప్రభుత్వానికి వాటి మీద ఎటువంటి అదుపూ లేకుండా పోయిందని అమాయకత్వాన్ని ప్రదర్శించారు. గత నవంబర్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరుగుతున్నదని చెప్పారు. చమురు ఉత్పత్తి (ఒపెక్) దేశాలు ఉత్పత్తులను తగ్గించుకొనే అవకాశమున్నందున ముందు ముందు దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు మరింతగా పెరగవచ్చునని కూడా అన్నారు. అంటే మీ చావు మీరు చావండని ప్రజలకు చెప్పి చేతులు ఎత్తివేయడమే తప్ప మరొకటి కాదు.

చమురు ధరలను వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకు రావడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారే గాని అది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేదు. పెట్రోల్ పంపుల వద్దనే ముక్కు పిండి వసూలు చేసే ఆదాయం కాబట్టి పెట్రోల్, డీజెల్ ధరల మీద కేంద్రం వసూలు చేస్తున్న అపరిమితమైన పన్నును అది వదులుకోడానికి ఇష్టపడదు. పెట్రోల్ ధరలో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల కిందే పోతున్నది. అలాగే డీజెల్ ధరలో 54 శాతం ప్రభుత్వాలకు పన్నుల కింద వెళుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినప్పుడల్లా వచ్చే మిగులును అనుభవిస్తున్నది కేంద్రమే కాబట్టి అక్కడ ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు తన పన్నును తగ్గించుకొని ప్రజలకు మేలు చేయవలసిన బాధ్యత దానిదే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News