రాష్ట్రాలూ కరోనాపై హోషియార్
టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, ఇందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివారం వెలువరించిన లేఖలలో రాష్ట్రాలకు సూచించింది. కేరళ, మహారాష్ట్రల్లో ఇటీవలి కాలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో రాత్రిపూట కర్ఫూ విధించారు. అమరావతి జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్నాయి. ఇక జనసమ్మర్థత, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే పుణేలో రాత్రిపూట కర్ఫూ పెట్టారు. ముంబైలోనూ అనివార్యంగా తిరిగి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. అమరావతి, అచలపూర్ వారం రోజులు లాక్‌డౌన్ విధించారు. దేశంలో కరోనా కేసుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం అయింది. వివిధ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. సునిశిత ప్రాంతాలను ఎంచుకుని అత్యధిక సంఖ్యలో ఆర్‌టి పిసిఆర్ టెస్టులు చేపట్టాలని, తరచూ మ్యుటెంట్ స్ట్రెయిన్స్‌పై పర్యవేక్షణ అవసరం అని, కంటైన్మెంట్, నిర్ణీత జిల్లాల్లో నిఘా పెంచాలని కేంద్రం సలహా ఇచ్చింది. దేశంలో క్రమేపీ తిరిగి పెరుగుతూ పోతున్న కరోనా కేసులతో ఇప్పుడు మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 1,45,634కు చేరుకుంది. అత్యధిక కేసులు అంటే 74 శాతానికి పైగా కేరళ, మహారాష్ట్రలలోనే ఉన్నాయి. ఇక రోజువారి కేసుల విషయానికి వస్తే ఇటీవలి రోజులలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు వారాలలో కేరళలో వారం వారిగా కరోనా కేసుల సంఖ్యలో హెచ్చదల కన్పించింది. ఇది ఇంతకు ముందు 8.9 శాతం ఉంటే ఇప్పుడు ఇది 13.9 శాతానికి చేరింది. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నాలుగు వారాలలో వీక్లీ కేసులు పెరిగాయి. ఇవి రెండింతలు కావడం ఆందోళన కల్గించింది. ప్రత్యేకించి ముంబై శివారు ప్రాంతాల్లో ఉన్నట్లుండి వారంలోనే కేసుల సంఖ్య 19 శాతం వరకూ పెరిగాయి. నాగ్‌పూర్, అమరావతి, నాసిక్, అకోలా, యావత్‌మాల్ వంటి ప్రాంతాలలో కేసులు ఎక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి. పంజాబ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రా్రష్ట్రాలన్ని కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేపట్టాలని, వెంటనే ఇందుకు అనుగుణంగా ఆర్‌టి పిసిఆర్ టెస్టులు నిర్వహించాలని, అవసరం అయిన వారిని తక్షణం ఐసోలేషన్‌కు పంపించడం, కట్టడికి చర్యలు తీసుకోవడం కీలక అంశాలని కేంద్రం తన లేఖలో తెలిపింది.
మహారాష్ట్రలో తిరిగి లాక్‌డౌన్:
పుణేలో రాత్రి కర్ఫూ
కరోనా కేసుల ఉధృతి, జనసంచారం కట్టడి సరిగ్గా లేకపోవడంతో మహారాష్ట్రలోని అమరావతి, అచలాపూర్‌లలో ఏడురోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధికారులు తెలిపారు. పుణేలో రాత్రి కర్ఫూ అమలులోకి తెచ్చారు. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి యశోమతి ఠాకూర్ పరిస్థితిని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. సాధ్యమైనంత వరకూ లాక్‌డౌన్ పరిస్థితి రాకూడదని భావించినట్లు, అయితే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో తీవ్రస్థాయిలోనే చర్యలు తీసుకుని తీరాల్సి వచ్చిందని వివరించారు. అమరాతిలో ముందు ఒక్కరోజు లాక్‌డౌన్ విధించగా ఇప్పుడు దీనిని వారం రోజులకు పెంచారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, లాక్‌డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తామని, ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. పుణేలో రాత్రి కర్ఫూను మరింతగా పొడిగించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ప్రజలు రోడ్లపైకి రావద్దని ఆదేశించారు.
ఆరు రాష్ట్రాలలో తిరిగి కరోనా పడగ
ప్రజల నిర్లక్షం, అధికారుల అలసత్వం ఆసరాగా చేసుకుని దేశంలో తిరిగి కరోనా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో ఆరు రాష్ట్రాలలో కరోనా తిరిగి పుంజుకొంటోంది.మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటకలలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. కేరళలో రోజుకు 4వేల కేసులు రికార్డు అవుతున్నాయి.మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. శుక్రవారం ఒక్కరోజే 101 మరణాలు రికార్డు అయ్యాయి.
ఇమ్యూనిటీ అని నిర్లక్షం వద్దు
దేశంలో సామూహిక వ్యాధి నిరోధకత అనే భావనలో ఉండరాదని, కరోనా కొత్త పుంతల దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. పూర్తి జనాభాకు సామూహిక క్రమంలో వైరస్ నుంచి రక్షణ దక్కాలంటే మనిషిలో కనీసం 80 శాతం యాంటీబాడీలు ఉండాలి. ఇది సాధ్యం అవుతుందా? అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొత్త కరోనా గురించి ప్రజలు నిర్లక్షంగా ఉండరాదని, వీటి బారిన పడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు అనివార్యం అని స్పష్టం చేశారు. కొత్త కరోనా వైరస్ రాదనే భావన ఏర్పడితే, దేశ ప్రజలు ఈ స్ట్రెయిన్‌కు దూరంగా ఉండవచ్చునని, ఇందుకు అనుగుణమైన సామూహిక రోగనిరోధకత ఉందని అనుకుంటే అది పొరపాటే అవుతుందన్నారు.
Corona Cases again rising in India