వర్చువల్ భేటీలో పాల్గొననున్న 30వేల మందికి పైగా నిపుణులు
23న జరిగే చర్చలో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్లతో మంత్రి కెటిఆర్ ముఖాముఖీ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021కు రంగం సిద్ధమైంది. 30 వేలకు పైగా నిపుణులు పాల్గొనే ఈ సదస్సును కరోనా కారణంగా వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. నేడు, రేపు హైదరాబాద్ వేదికగా జరగనున్న సదస్సుకు ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు తమ ఆవిష్కరణలు, పరిశోధనలతో హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరగే ఈ సదస్సును రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. ప్రధానంగా ఈ సదస్సులో ఆరోగ్యరంగానికి కొవిడ్ విసిరిన సవాళ్లు..ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ అవకాశాలపై చర్చించనున్నారు. ఏటా హైదరాబాద్‌లో జరిగే సదస్సు నిర్వహణలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, నోవార్టిస్, అరబిందో ఫార్మా….హెటిరో, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దిగ్గజ సంస్థలైన జివికె, భారత్ బయోటెక్, ఫెర్రింగ్, సైటివా వంటి సంస్థలు హాజరుకానున్నాయి. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యా నాదెళ్ల సహా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి బలరామ్ భార్గవ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యస్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ పాల్గొననున్నారు. ఈసారి సదస్సు ప్రధానంగా కొవిడ్ విసిరిన సవాళ్లు, లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకువచ్చిన మార్పులు, ఇమ్యునైజేషన్‌లో భారత పాత్ర వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. 23న జరగబోయే చర్చలో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్లతో మంత్రి కెటిఆర్ ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో సాంకేతికత, డిజిటల్‌సేవలు, అంకురాల పాత్రపై చర్చించనున్నారు.
KTR to meeting with Microsoft CEO on Feb 23