ప్రగతిభవన్ భేటీలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలకు ముఖ్యమంత్రి వినతి
వాణీదేవిని పరిచయం చేసిన సిఎం కెసిఆర్ మంత్రి కెటిఆర్ తదితర ప్రముఖుల హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ — రంగారెడ్డి –మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలపై టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలు, మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి ఎన్నికలపై సోమవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణీదేవి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కు చెందిన మంత్రులు, టిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హా జరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎ, టిఆర్‌ఎస్ పార్టీ నేతలకు సిఎం కెసిఆర్ వాణీదేవిని పరిచయం చేశారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎంపి రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, మెతుకు ఆనంద్, గోపీనాథ్, సుధీర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎంపిలు, ఎంఎల్‌ఎలు బాధ్యత తీసుకుని వాణీదేవీని గెలిపించేందుకు కృషి చేయాలని సిఎం కెసిఆర్ పార్టీ నేతలను కోరారు. గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించేందుకు పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎం కెసిఆర్ ఆయా జిల్లాల నేతలకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి సిఎం కెసిఆర్ బి.పామ్‌ను అందజేశారు.
సిఎం కెసిఆర్ నమ్మకాన్ని నిలబెడతా : వాణీదేవి
తన మీద నమ్మకంతో పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ఎంఎల్‌సి అభ్యర్థి సురభివాణి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం సురభి వాణీదేవి పివి ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలు పివి ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే గ్‌న్‌పార్క్‌కు వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపానికి వాణిదేవి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎంఎల్‌సి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని అన్నారు. తెలంగాణను టిఆర్‌ఎస్ తేవడం గొప్ప విషయమని, అందుకే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. తనకు విద్య మీద పూర్తి అవగాహన ఉందని, సమస్యలు పరిష్కరించగలను అనే నమ్మకం తనకు ఉందని, అందుకే ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్నానని సురభివాణి తెలిపారు. అనంతనం సురభి వాణీదేవి టిఆర్‌ఎస్ నేతలతో కలిసి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
CM KCR Meeting on Graduate MLC Elections