Friday, September 20, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి

- Advertisement -
- Advertisement -
CPI General secretary D Raja has written to PM Modi
ప్రధాని మోడీకి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా లేఖ

న్యూఢిల్లీ: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ(ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటీకరణకు ఆమోదిస్తూ ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సిసిఇఎ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీలు ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా ప్రధానికి లేఖ రాస్తూ ప్రైవేటైజేషన్ ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్ నుంచి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 50 ఏళ్లకు ముందు 23,000 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించార, రైతులకు చెల్లించాల్సిన డబ్బును కూడా పూర్తిగా చెల్లించలేదని రాజా తెలిపారు.

ఇప్పుడు ఆ భూముల విలువ లక్షల కోట్ల రూపాయలలో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనను అనుమతిస్తే కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న కంపెనీలలో ఒకటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఒక ప్రైవేటు కంపెనీ చేజిక్కించుకోవడమేగాక ఆ విలువైన భూములను ఆక్రమించుకుంటుందని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను లాభాల బాటలో నడిపేందుకు గల సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎటువంటి ఇనుప ఖనిజం గనులను కేటాయించలేదని ఆయన తెలిపారు. అన్ని ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలకు ఇనుప ఖనిజ గనులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఉక్కు పరిశ్రమ కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ఈ వినాశకర చర్యను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. సిసిఇఎ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఈ ప్రతిపాదనను కేంద్రం పునఃపరిశీలించాలని ఆయన డిమాండు చేశారు.

CPI general secretary D Raja wrote a letter to PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News