రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలోనూ విజయ ఢంకా
బోణీ కొట్టిన ఆప్, చతికిల పడిన కాంగ్రెస్
ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి క్లీన్‌స్వీప్ చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అన్ని కార్పొరేషన్‌లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలోని మొత్తం 576 డివిజన్లకు ఆదివారం ఎన్నికలు జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకుగాను భారతీయ జనతా పార్టీ 466 డివిజన్లలో విజయం సాధించి సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమై పూర్తిగా చతికిలపడిపోయింది. కాగా ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీపార్టీ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్‌లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఇక అనేక రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ ఏడు చోట్ల సత్తా చాటింది.
భావ్‌నగర్ కార్పొరేషన్‌లోని 52 డివిజన్లకుగాను బిజెపి 44 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. జామ్‌నగర్‌లోని 64 స్థానాలకుగాను కాషాయపార్టీ 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 11, బిఎస్‌పి 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక 120 స్థానాలున్న సూరత్‌లో బిజెపి 93 స్థానాల్లో దూసుకెళ్లింది. తొలిసారి బరిలోకి దిగిన ఆప్ 27 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేక చతికిల పడిపోయింది. రాజ్‌కోట్‌లోని 72 డివిజన్లకుగాను బిజెపి 68 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. వడోదరాలోని మొత్తం 76డివిజన్లలో బిజెపి 69 డివిజన్లను గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితమైంది. అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలుండగా.. బిజెపి 161 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొందగా ఎంఐఎం 7 డివిజన్లను తన ఖాతాలో వేసుకొంది. మరికొన్ని స్థానాల ఫలితాలు తెలియాల్సి ఉంది.
థ్యాంక్యూ గుజరాత్: మోడీ
కాగా గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్రప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. గుజరాత్ ప్రజలకు సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
26న గుజరాత్‌కు కేజ్రివాల్
కాగా గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో తొలి సారి బరిలోకి దిగి 27 స్థానాలు గెలుపొందడంతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నెల 26న సూరత్‌లో జరిగే విజయోత్సవ ర్యాలీకి ఢిల్లీ సిఎం, పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ హాజరు కానున్నారు.