జూనియర్ కళాశాలల అఫిలియేషన్లకు కొత్త విధానం
హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఐపాస్, బిపాస్ తరహా సింగిల్ విండో అనుమతుల విధానం అమలులోకి రానుంది. కళాశాలల అనుమతులకు కూడా కాలపరిమితితో కూడిన విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నూతన విధానంలో ప్రభుత్వం విధించిన కాలపరిమితిలోగా అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిస్తే మాత్రం దరఖాస్తునే గుర్తింపుగా పరిగణించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విండో అనుమతుల విధానం అమలులోకి వస్తే కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ గడువులోగా త్వరగా పూర్తవ్వడమే కాకుండా యాజమాన్యాలు, అధికారుల సమయం వృథా కాకుండా ఉంటుంది. ప్రస్తుతం కళాశాలల అనుమతుల కోసం ప్రైవేట్ యాజమాన్యాలు పలు ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు పొంది, వాటిని ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. కొత్త విధానంలో యాజమాన్యాలు యేటా అన్ని విభాగాలకు తిరిగి అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు సమర్పించే విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు.
వెంటనే అనుమతి..
జూనియర్ కళాశాలల అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుపై ప్రభుత్వం ఇప్పటికే ఆయా విభాగాల అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. కళాశాలల గుర్తింపునకు ప్రధానంగా అగ్నిమాపక నిరంభ్యంతర పత్రం(ఫైర్ ఎన్‌ఒసి), పక్కా భవనం లేదా రిజిస్టర్డ్ లీజ్ డీడ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, సానిటరీ సర్టిఫికెట్లతో పాటు క్రీడా మైదానం ఉండాలి. యాజమాన్యాలు యేటా ఆయా విభాగాల నుంచి అనుమతులు పొంది ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు అనుమతి పత్రాలను అప్‌లోడ్ చేసేవారు. సింగిల్ విండో విధానంలో యాజమాన్యాలు అన్ని విభాగాల నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కళాశాలల అనుమతుల కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోగా, ఆయా విభాగాలకు ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపిస్తారు. వీటిని ఆయా విభాగాల అధికారులు పరిశీలించి నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా అన్నీ సక్రమంగా ఉంటే అనుమతులు మంజూరు చేస్తారు. దరఖాస్తుల్లో ఏమైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటికి అనుమతులు జారీ చేయకుండా తిరస్కరిస్తారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే విద్యా నుంచి నూతన విధానం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
షరతుల అనుమతి విధానానికి ముగింపు..
నిబంధనల ప్రకారం అన్ని ఉంటేనే కళాశాలలకే అనుబంధ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో సరైన వసతులు లేని కళాశాలలు షరతులతో అనుమతులు పొందుతున్నాయి. కళాశాలకు అనుబంధ గుర్తింపు లేకపోయినా కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రవేశాలు చేపట్టి, విద్యార్థుల భవిష్యత్తు పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి షరతులతో కూడిన అఫిలియేషన్ పొందుతున్నారు. తమ కళాశాలల్లో లేని వసతులను మూడు నెలల్లో సమకూర్చుకుంటామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బోర్డు అధికారులకు హామీ ఇస్తూ షరతులతో అఫిలియేషన్ పొందుతున్నారు. తర్వాత ఆ వసతుల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. సింగిల్ విధానం అమలులోకి వస్తే షరతులతో అనుమతులు ఇచ్చే విధానానికి ముగింపు పడనుంది. నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉన్న కళాశాలలకే అనుబంధ గుర్తింపు లభించనుంది.