Monday, November 25, 2024

పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Price Rise in India

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్య ప్రజలకు మోయలేని భారంగా పరిణమిస్తున్నాయి. గత ప్రభుత్వాలు వ్యవహరించిన వైఖరితోనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగాయని ప్రధాని వ్యాఖ్యానించడం విడ్డూరంగా కనబడుతోంది. ఇటీవల ప్రధానమంత్రి తమిళనాడులోని రామనాథపురం- తూత్తుకుడి నేచురల్ గ్యాస్ పైపులైన్ ను, గ్యాసోలిన్ డీసల్ఫరైజేషన్ యూనిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మాటలు ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి. ఇంధన దిగుమతుల విషయంలో గత ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే చమురు ధరలు పెరిగిన పరిస్థితి తలెత్తిందని, దీంతో ప్రస్తుతం దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు భారం మోయాల్సి వస్తుందని చెప్పిన ప్రధాని తమ వైఫల్యాన్ని యుపిఎ ప్రభుత్వం పై రుద్దటానికి ప్రయత్నించారు.

తమ ప్రభుత్వ వైఫల్యాలను అడ్డగోలుగా గత ప్రభుత్వాలకు అంటగట్టడం, సాధించిన కొద్దో గొప్పో విజయాలను బాజాభజంత్రీలతో ఆర్భాటం చేస్తూ తమ ఖాతాలో వేసుకోవడం బిజెపి పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య. 2014 ముందు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల విషయంలో ఖాళీ గ్యాస్ మొద్దులను ప్రదర్శిస్తూ, ఆటోలను, మోటార్ సైకిళ్లను తాళ్లతో లాగుతూ, రాస్తారోకో, భారత్ బంద్ లాంటి అస్త్ర శస్త్ర కార్యక్రమాలతో ధరల పెరుగుదలను రక్తికట్టించి మన్మోహన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి గగ్గోలు పెట్టిన మోడీ, స్మృతి ఇరానీ లాంటి అనేక మంది నేతలు అధికారానికి రాచబాటలు వేసుకొని నేడు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ తమ వైఫల్యాన్ని గత ప్రభుత్వాల ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయానికి బ్యారెల్ ముడి చమురు ధర 107 డాలర్లుగా ఉండగా, లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలుగా ఉంది. తరువాత కాలంలో 2015 జనవరి నాటికి 50 డాలర్లకు, 2016లో 27 డాలర్లకు బ్యారెల్ ముడి చమురు ధర పడిపోయింది. 2020లో సగటున బ్యారెల్ ముడి చమురు ధర 40డాలర్లుగా ఉంది.

2014లో ముడి చమురు ధర బ్యారెల్ 107 డాలర్లు ఉంటే లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా, ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 53 డాలర్లు ఉంటే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువలో ఉండటం ప్రధాని మాటలలో డొల్లతనం వెల్లడిస్తోంది. ఇటీవల బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా పెట్రో ధరలపై చేసిన ట్వీట్ ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది. రాముడు పుట్టిన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93 గా, సీతాదేవి పుట్టిన నేపాల్‌లో రూ. 53 గా, రావణుడు పుట్టిన లంకలో రూ. 51 రూపాయలుగా సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ పెట్రో ధరల పెరుగుదల పై ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది. ఫిబ్రవరి 15, 2021 గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్. కామ్ ప్రకారం మన పొరుగు దేశాలైన శ్రీలంకలో పెట్రోల్ లీటరుకు రూ. 60.29, డీజిల్ లీటరుకు రూ. 38.91, నేపాల్ లో పెట్రోల్ రూ. 69.01 డీజిల్ రూ. 58.32, పాకిస్తాన్‌లో పెట్రోల్ రూ. 51.12, డీజిల్ రూ. 53.02, బంగ్లాదేశ్‌లో పెట్రోల్ రూ. 76.43, డీజిల్ రూ. 55.78 రూపాయలుగా నమోదై మన కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించాల్సి ఉండగా, దీనికి విరుద్ధంగా వీటి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, మన దేశీయ మార్కెట్లో చమురు ధరలను పరిశీలించినట్లయితే మోడీ ఏడేళ్ల పాలనలో చమురు ధరలకు, మన్మోహన్ సర్కారు హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలకు ఏమాత్రం పొంతనే లేదని స్పష్టమవుతోంది.

యుపిఎ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రచ్చ చేసిన బిజెపి తన పాలనలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీ స్థాయిలో పడిపోతున్నప్పటికీ ఆ స్థాయి లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. 2014 యుపిఎ పాలనలో లీటర్ పెట్రోల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ. 9.48 పైసలు ఉంటే 2021లో లీటర్ పెట్రోల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ 32. 98 పైసలకు బిజెపి ప్రభుత్వం పెంచింది. ఎక్సైజ్ సుంకాన్ని ఏడేళ్లలో పెట్రోల్ పై 350 శాతం పెంచి ప్రజలపై మోయలేనంత భారం పెట్టింది. 2014లో లీటర్ డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ. 3.56 పైసలు ఉంటే నేడు రూ. 31. 83 పైసలుగా ఉండి 890 శాతం మేర ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోల్ పై రూ. 2.50, డీజిల్ రూ. 4.00 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దానికి సమానంగా అగ్రి సెస్ పెంచడంతో వినియోగదారునికి లాభం లేకుండాపోయింది.

ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి అగ్రి సెస్ విధించడంతో ఆ మేరకు రాష్ట్రానికి వాటా ఇవ్వవలసిన అవసరం లేకుండా కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకునే వైఖరి ప్రదర్శించింది. 2014లో పెట్రోలియం ఉత్పత్తులపై 14 శాతం పన్నుల ద్వారా కేంద్రానికి రూ. 99 వేల కోట్లు సమకూరితే, 2019- 2020 నాటికి పన్నులను 38 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచడంతో 2.40 లక్షల కోట్ల రూపాయలను పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ప్రజల నుంచి పన్నులను వసూలు చేస్తోంది. 2014లో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా రాష్ట్రాలు విధించే పన్నులు 17 శాతం ఉంటే నేడు అది 23 శాతానికి చేరింది. ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెంచుతూ వినియోగదారుడి నడ్డి విరుస్తున్న చమురు సంస్థలు గ్యాస్ బండ ధరను కూడా ఎడాపెడా పెంచేస్తున్నాయి. జనవరి నెలలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 746. 50 ఉండగా ఈనెల 3వ తేదీన 25 రూపాయలు పెరిగి రూ 771.50 అయ్యింది. పక్షం రోజులు కాకముందే ఫిబ్రవరి 14వ తేదీ నుండి మరో 50 రూపాయలు పెరిగి రూ 820.50 కు గ్యాస్ చేరుకుని సామాన్య మధ్యతరగతి గృహిణిల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నేపాల్, శ్రీలంక లాంటి దేశాల్లో సైతం బిజెపి పార్టీని విస్తరించి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నా బిజెపి నాయకులు కనీసం నేపాల్, శ్రీలంక దేశాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు చూసైనా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల బాదుడు నుంచి విముక్తం చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

బిల్లిపల్లి లకా్ష్మరెడ్డి- 9440966416

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News