అంతర్జాతీయ నిపుణుల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారికి దాదాపు 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవిధంగా ప్రాణనష్టమేకాదు ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక సంక్షోభం కూడా సంభవించింది. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి వల్ల దాదాపు 2 కోట్ల ఏళ్ల జీవిత కాలం నష్టం సంభవించిందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతర్జాతీయ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్‌లో ఈ అధ్యయనం వెలువడింది.
ఈ అధ్యయనంలో భారత్‌తోపాటు 81 దేశాలకు చెందిన కొన్ని నెలల కోవిడ్ మరణాల సమాచారాన్ని విశ్లేషించారు. కరోనా మృతుల వయస్సు, వారి జీవితకాలం మధ్యతేడాను ఇయర్స్ ఆఫ్ లాస్ట్(వైఎల్‌సి)గా పరిగణన లోకి తీసుకున్నారు. ఈ విధంగా మృతి చెందిన వ్యక్తి సరాసరి ఆయుష్సు 16 ఏళ్లుగా లెక్కగట్టారు. ఇలా ఇప్పటివరకు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి వల్ల 2,05,07,518 సంవత్సరాల జీవిత కాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు. కరోనా మరణాల వల్ల నష్టపోయిన మొత్తం జీవితకాలం నష్టంలో 44.9 శాతం 55 నుంచి 75 ఏళ్ల వయసున్న వారి వల్లేనని ఈ అధ్యయనం పేర్కొంది. 55ఏళ్ల లోపు వయసున్న వారి వల్ల 30 శాతం, 75 ఏళ్ల పైనున్న వారి వల్ల 25 శాతం కోల్పోయినట్టు అధ్యయనం వివరించింది. కొవిడ్ మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో దాదాపు 44 శాతం పురుషుల జీవన కాల నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది.