సహాగంజ్ : ప్రధాని మోడీ కాకలు తీరిన విధ్వంసకుడని, ఆయనకు డొనాల్డ్ ట్రంప్ కన్నా దారుణ పరిస్థితి కాచుకుని ఉందని పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ మండిపడ్డారు. దేశంలో మోడీని మించిన కల్లోలి కంగాళి మరొకరు లేరన్నారు. హుగ్లీ జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో మమత బెనర్జీ ఆవేశపూరిత ప్రసంగంలో మోడీపై నిప్పులు చెరిగారు. ఇష్టం వచ్చినట్లుగా విధ్వంసకారకుడు అవుతున్న మోడీకి అమెరికాలో ట్రంప్ శాల్తీకి పట్టిన గతే పడుతుందని చెప్పారు. ట్రంప్‌ను మించిన దారుణ పరిస్థితి మోడీకి తప్పదని హెచ్చరించారు.
దేశంలో మోడీ, షా ద్వయం విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. అమెరికాలో ట్రంప్ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. చివరి దశలో విధ్వసంకులను రెచ్చగొట్టాడు. మోడీ తన విద్వేషకర ధోరణితో అంతకు మించి ముప్పు తెచ్చిపెడుతున్నాడని , వినాశనకారుడికి ఎక్కడైనా అధ్వాన్న స్థితి దాపురిస్తుందని , ఇది ఖాయమైన విషయం అన్నారు. హింసాకాండతో ఎవరూ ఏదీ సాధించలేరని వ్యాఖ్యానించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తాను గోల్‌కీపర్‌గా ఉన్నానని, తాను ఈ కీలక పాయింట్‌లో ఉన్నప్పుడు బిజెపి ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయలేదని తేల్చిచెప్పారు. ఎటువంటి షాట్ అయినా గోల్ పోస్టు పై నుంచి పోవల్సిందే అన్నారు. ఇటీవలే టిఎంసి ఎంపి ( మమత మేనల్లుడు కూడా) అయిన అభిషేక్ బెనర్జీ భార్యను బొగ్గుసంబంధిత స్కామ్‌లో ఇంటరాగేట్ చేసిన విషయాన్ని మమత ప్రస్తావించారు. ఇది మన మహిళను అవమానించడమే అని విమర్శించారు. ఇక్కడ జరిగిన సభలోనే క్రికెటర్ మనోజ్ తివారి, పలువురు బెంగాలీ నటులు మమత బెనర్జీ సమక్షంలో టిఎంసిలో చేరారు.