హైదరాబాద్: నగరంలో మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి రంగం సిద్ధం చేసింది. త్వరలో మరో 50 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కానున్నాయి. నగర నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా 2018 ఏఫ్రిల్ 6వ తేదీన మల్కాజ్‌గిరిలోని బిజెఆర్ నగర్‌లో మొట్ట మొదటి బస్తీ దవాఖానాను పురపాలక శాఖ మంత్రి కె.తారాక రామారావు చేతుల మీదగా ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ప్రతి వార్డులో 2 చోప్పున మొత్తం 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి దశల వారిగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు అదనంగా నగరంలో ఇప్పటీకే 225 బస్తీ దవాఖానాలను జిహెచ్‌ఎంసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి బస్తీ దవాఖానాలో ఓపి సేవలతో పాటు టెలి కన్సల్టేషన్, మౌలిక ల్యాబ్ పరీక్షలు, ఇమ్యునైజేషన్ తదితర వైద్య సేవలను అందిస్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి రోజు 25వేల కంటే అధిక మంది బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలను అందుకుంటున్నారు. ముఖ్యంగా పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రతి బస్తీ దవాఖాన ద్వారా ప్రతి రోజు 100 మంది వరకు అవుట్ పేషెంట్లు( ఓపి) ద్వారా వైద్య సేవలను అందించడమే కాకుండా సుమారు 40 రకాల టెస్టులకు సంబంధించి నమూనాలను సేకరిస్తున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా ఉచితంగా మందులను సైతం అందజేస్తున్నారు. అంతేకాకుండా రోజువారిగా 5 వేల నుంచి 7 వేల వరకు టెస్టులకు సంబంధించి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపిస్తుంటారు. ఇదే క్రమంలో 300 బస్తీ దవాఖాల ఏర్పాటులో భాగంగా కొత్తగా మరో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సంబంధించి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేస్తోంది. బస్తీ దవఖానాల ఏర్పాటులో భాగంగా జిహెచ్‌ఎంసి భవనాలను సమకూర్చడంతో పాటు వాటిలో మౌలిక సదుపాయాలను కల్పింస్తోంది. ప్రతి జోన్‌లో 8 నుంచి 10 వరకు బస్తీ దవాఖానాలను జిహెచ్‌ఎంసి సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే ఆరోగ్య శాఖకు అప్పగించనుంది. ఆ తర్వాత ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ఈ బస్తీ దవాఖానాలు పని చేయనున్నాయి.