తల్లులకు నిలువెత్తు మొక్కులు, బంగారం సమర్పణ..
జంపన్న వాగులో స్నానాలు, కిక్కిరిసిన గద్దెలు…
ములుగు: ఆదివాసీ ఆరాధ్యదైవలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలి వస్తున్నారు. ముందుగా భక్తులు జంపన్న వాగులో పున్యస్నానాలు ఆచరించారు. యువతుల కేరింతలు, భక్తుల పూనకాలతో జంపన్నవాగు హోరెత్తింది. కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చి, నిలువెత్తు బంగారంతో నెత్తిమీద పెట్టుకుని అమ్మవార్ల సన్నిధికి చేరుకుని మొక్కులు సమర్పించుకున్నారు. మినీ మేడారం జాతర రెండవ రోజు గురువారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెల ప్రాంగణంలో భక్తులు శివసత్తులకు చీర, సారలను సమర్పించుకున్నారు. ఎత్తు బంగారం వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జంపన్న వాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్స్ కింద భక్తులు పున్యస్నానాలు ఆచరించారు. గద్దెల వద్ద ఏర్పాటు చేసిన మంచ పైనుండి అధికారులు భక్తులకు సూచనలు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను క్రమపద్ధ్దతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. జంపన్న వాగు, శివరాంసాగర్ చెరువు, గద్దెల పరిసరాలలో అధికంగా భక్తుల రద్దీ ఉండటంతో ప్రత్యేక గస్తీ నిర్వహించారు. భద్రతా దృష్టా సీసీ కెమెరాల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు మంచినీళ్ల సౌకర్యం కల్పించారు. జాతర సందర్భంగా మేడారంలో వెలిసిన దుకాణాలలో భక్తులు చిన్నపిల్లలకు ఆటబొమ్మలు కొనుగోలు చేశారు. శివసత్తులు పూనకాలతో వనదేవతలను దర్శించుకున్నారు. మినీ మేడారం జాతరకు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.