Friday, November 22, 2024

వికెట్ల ‘మోతే’రా

- Advertisement -
- Advertisement -

India win 3rd Test with 10 Wickets against England

 

మళ్లీ చెలరేగిన అక్షర్, అశ్విన్, 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్, గులాబీ టెస్టు టీమిండియా ఘన విజయం

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో డేనైట్ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. స్పిన్నర్ల హవా సాగిన ఈ గులాబి బంతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 8 పరుగులకే ఐదు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఇక జాక్ లీచ్ 4 వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. అయితే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 33 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు గెలుపు కోసం కేవలం 49 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ లక్ష్యాన్ని టీమిండియా 7.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 25 (నాటౌట్), శుభ్‌మన్ గిల్ 15 (నాటౌట్) ఈ లాంఛనాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. దీంతో మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగిసింది.

మళ్లీ తిప్పేశాడు..

భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్నా ఆనందం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. అక్షర్ పటేల్ ఆరంభం నుంచే చెలరేగి పోయాడు. ఇంగ్లండ్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రాలీ (0), వన్‌డౌన్‌లో వచ్చిన జానీ బెయిర్ స్టో (0)లను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికీ ఇంగ్లండ్ స్కోరు సున్నా పరుగులే. ఆ వెంటనే డొమినిక్ సిబ్లి (7) కూడా అక్షర్ వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ జో రూట్, బెన్ స్టోక్స్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇంగ్లండ్ స్కోరును 50 పరుగులకు చేర్చారు. అయితే ప్రమాదకరంగా మారేలా కనిపించిన ఈ జోడీని అశ్విన్ విడగొట్టాడు. 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన స్టోక్స్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు. 19 పరుగులు చేసిన రూట్‌ను లక్షర్ వెనక్కి పంపాడు.

ఈ క్రమంలో కెరీర్‌లో తొలిసారి ఒక మ్యాచ్‌లో పది వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. జోఫ్రా ఆర్చర్ (0), జాక్ లీచ్ (9)లను అశ్విన్ ఔట్ చేశాడు. ఇక బెన్ ఫోక్స్ (8)ను అక్షర్ పెవిలియన్ బాట పట్టించాడు. ఈ మ్యాచ్‌లో లక్షర్‌కు ఇది 11వ వికెట్ కావడం విశేషం. మరోవైపు అండర్సన్ (0)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 30.4 ఓవర్లలో 81 పరుగుల వద్దే ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. సుందర్‌కు ఒక వికెట్ లభించింది. ఇక ఇంగ్లండ్ ఉంచిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. రోహిత్ 25 (నాటౌట్), గిల్ 15 (నాటౌట్)లు రాణించడంతో టీమిండియా వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 11 వికెట్లతో జట్టును గెలిపించిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

రూట్ దెబ్బకు విలవిల

అంతకుముందు 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయమని అందరు భావించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి పోవడంతో భారత్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. 46 పరుగులకే మిగిలిన ఏడు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 99 బంతుల్లో 11 ఫోర్లతో 66 ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బంతితో చెలరేగి పోయాడు. 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. లీచ్ కూడా నాలుగు వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ 145 పరుగుల వద్దే ముగిసింది. దీంతో టీమిండియాకు కేవలం 33 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News