Tuesday, November 26, 2024

పబ్లిక్ రంగానికి మంగళం!

- Advertisement -
- Advertisement -

Public sector is completely to Private

 

దేశాన్ని ముందుకు తీసుకుపోయే చోదక శక్తి, అనూహ్యమైన ఎత్తులకు ఎగరేసుకుపోయే అభివృద్ధి రాకెట్ ప్రైవేటు రంగమేనని ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నీళ్లు నములుడూ లేకుండా మరోసారి ప్రకటించారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించదలచామని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడిగా ఉన్నాయనో, ఎవరికో ఇష్టమైన ప్రాజెక్టులనే ఉద్దేశంతోనో ప్రభుత్వ రంగ సంస్థలను మోస్తూ పోవలసిన అవసరం లేదని అన్నారు. ఈ మాటల ద్వారా ఆయన ప్రభుత్వ రంగాన్ని మునివేళ్లతో నాటి సాకి పెంపొందించిన ఒకప్పటి ఆదర్శ శకాన్ని ఎద్దేవా చేయదలచుకొని ఉండవచ్చు. అది ఆయనకు, ఆయన పార్టీకి రాజకీయంగా అవసరమై ఉండవచ్చు. కాని స్వాతంత్య్రానంతరం కేవలం వ్యవసాయ ప్రధానంగా ఉన్న భారత దేశానికి పారిశ్రామిక ముఖాన్ని తొడిగి అందులో విశేష ప్రగతిని సాధించిన పబ్లిక్ రంగం పాత్రను తక్కువగా పరిగణించడం సమంజసం కాదు. ఈ పరిశ్రమలు చిరకాలం పాటు విశేష లాభాల్లో నడిచి దేశ మెజారిటీ జనాభా అయిన పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఎనలేని సేవలు చేసిన విషయాన్ని విస్మరించరాదు.

బ్యాంకుల జాతీయకరణ వల్ల దిక్కుమొక్కు లేని జనానికి కలిగిన ప్రయోజనాన్ని మర్చిపోకూడదు. అయితే అదంతా గతం, పబ్లిక్ రంగానికి తెర దించి దేశ ఆర్థిక పగ్గాలను ప్రైవేటు చేతిలో పెట్టే అధ్యాయం వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది. ఆర్థిక సంస్కరణలనే పేరుతో ఈ ఘట్టానికి 1980వ దశకంలోనే తెర లేచింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిని ఇప్పుడు పరాకాష్ఠకు తీసుకుపోయి పబ్లిక్ రంగం ఆనవాళ్లు కూడా లేకుండా చేయదలచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ విషయం అనుమానానికి ఆస్కారం లేకుండా వెల్లడైంది. 300కి పైగా గల పబ్లిక్ రంగ సంస్థల్లో కేవలం ఇరవైనాలుగింటిని మినహాయించి మిగతా అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించినట్టు బడ్జెట్ తేటతెల్లం చేసింది. 2021లో జరిపే ఈ విక్రయాల ద్వారా రూ. లక్షా 75 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంశం పై వెబినార్ కార్యక్రమంలో మాట్లాడుతూ దీనిపై మరింత స్పష్టత ఇచ్చారు, నిర్మొహమాటంగానూ మాట్లాడారు.

నష్టాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం ఆర్థిక వ్యవస్థకు చెప్పనలవికాని భారమన్నారు. రూ. 2 లక్షల 50 వేల కోట్ల విలువైన వంద పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయదలచామని చెప్పారు. పేదల డబ్బుతో వీటిని నడుపుతున్నామన్నారు. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బును సంక్షేమం కింద, అభివృద్ధి కార్యక్రమాల కోసం, పౌరులకు సాధికారత కల్పించడానికి, ఉద్యోగాల సృష్టికి ఖర్చు పెడతామని వివరించారు. పబ్లిక్ రంగ సంస్థలు ఎందుకు, ఎవరి వల్ల నష్టాలు పాలయ్యాయన్నది ప్రధానమైన చర్చనీయాంశం. రెండేళ్ల క్రితం 2018-19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 25.43 లక్షల కోట్ల ఆదాయాన్ని గడించాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రూ. 7,132 కోట్లు, బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 6040 కోట్లు, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రూ. 6029 కోట్ల లాభాలు సాధించినట్టు వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి.

ఇంకా ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్ వంటి పబ్లిక్ రంగ సంస్థలు ఆ ఏడాది విశేష లాభాలు ఆర్జించాయి. అదే సమయంలో తపాలా, ఎయిర్ ఇండియా, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ వంటి సంస్థలకు నష్టాలు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం గనుల కేటాయింపు లేకనే నష్టాల పాలయ్యింది. బాగా నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చుకున్న లాభాలు వేల కోట్లలో ఉంటే దెబ్బతిన్న వాటి నష్టాలు వందల కోట్లలో ఉన్నాయి. అన్ని పబ్లిక్ రంగ సంస్థల్లోనూ పది, పదకొండు లక్షల మంది శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరెన్నో లక్షల కుటుంబాలకు అవి జీవనాధారమవుతున్నాయి.

అయితే అంతర్జాతీయ, జాతీయ బడా పెట్టుబడి ఒత్తిడికి అంతటా అన్ని దేశాల ప్రభుత్వాలు దాసోహమంటున్న నేపథ్యంలో మన పాలకులు కూడా అదే పాట పాడడాన్ని, ఆ ఉరవడిని ఎదుర్కోలేకపోడాన్ని అర్థం చేసుకోక తప్పుదు. కాని ఏ బేరమైనా తెగనమ్ముకునే విధంగా ఉండరాదు. కరోనా సంక్షోభం లో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను బయటకు లాగాలన్న తొందరలోనో రాజకీయంగా తమకు మేలు కలిగిస్తున్న ప్రైవేటు శక్తులు, వ్యక్తులకు విశేష ప్రయోజనం కలిగించాలన్న దృష్టితోనో ఎంతో విలువైన ఆస్తులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలను చవకబారుగా కట్టబెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదు. మన ప్రైవేటు పెట్టుబడిదారుల్లో అధిక శాతం ఆశ్రిత పెట్టుబడిదారులేనన్న సంగతిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ఆదరాబాదరాగా అప్పగించబోవడంలోని అనైతికత విశదమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News