బెంగాల్లో గెలవాలన్న బిజెపి కోరిక రహస్యమేమీ కాదు. యావద్దేశంలో బిజెపి ప్రభుత్వాలుండాలనే కోరిక ఎలాగూ ఉండనే ఉంది. దానికి తోడు ఇప్పుడు బెంగాల్లో గెలవడం రాజకీయ అవసరంగా కూడా మారింది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ముందు ముందు మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఉత్తరాదిలో ఎదురయ్యే నష్టాలను పూడ్చుకోడానికి దక్షిణాది వైపు, తూర్పు రాష్ట్రాల వైపు చూస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి అవకాశాల్లేవు. కాబట్టి బెంగాల్లో బలంపుంజుకోవడం రాజకీయ అవసరం. ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి నాయకులు ఏ స్థాయి రాజకీయాలు నడపగలరో ఢిల్లీ ఎన్నికలు తాజా ఉదాహరణలు. బెంగాల్ ఎన్నికల విషయంలో ఈ భయాలే చాలా మందిలో ఉన్నాయి.
పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాని ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనే భయాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉంది. మమతాబెనర్జీ ముఖ్యమంత్రిగా చాలా గొప్పగా పనిచేశారనీ చెప్పలేము, అలాగే ఆమె పరిపాలన మరీ తీసికట్టుగా ఉందని కూడా చెప్పలేము. సగటు స్థాయిలో పరిపాలన ఉంది. కొన్ని ప్రజాకర్షక, సంక్షేమ పథకాలు ఆమె అమలు చేశారు.
ప్రజాస్వామిక హక్కులను గౌరవించడం, అవినీతిని అడ్డుకోవడంలో తృణమూల్ రికార్డు చాలా అధ్వానంగా ఉంది. పశ్చిమబెంగాల్లో ఇప్పుడు వామపక్షాలు పూర్తిగా తెరమరుగయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంగా మిగిలింది. ఈ నేపథ్యంలో బిజెపి బెంగాల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవాలను మార్చలేము. అలాగే, ఏ ప్రభుత్వం వచ్చినా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రత్యేకంగా ఒరగబెట్టేది కూడా ఏదీ ఉండదు. ప్రజల బతుకుల్లో గొప్ప మార్పు ఏదీ రాదు.
ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పు డు అంత ముఖ్యమైన విషయం కాదు, అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎలాంటి వాతావరణంలో జరగబోతున్నాయన్నది చింతించవలసిన విషయం. అంతేకాదు, ఎన్నికల తర్వాత ఎలాంటి సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తాయన్నది కూడా ఆందోళనకరంగా కనిపిస్తున్నది. అంతేకాదు, ఎన్నికల రోజున ప్రశాంత వాతావరణం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కాని ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందా అని కూడా భయపడుతున్నారు. విభిన్న సముదాయాల మధ్య పెద్ద అఖాతాన్ని ఈ ఎన్నికలు సృష్టించవచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న అనేక జాతీయ సంస్థలు మరింతగా దెబ్బతినవచ్చని కూడా మరికొందరి అనుమానం.
గత అనుభవాలు: పశ్చిమ బెంగాల్లో ఇలాంటి అనుభవాలు గతంలో కూడా ఉన్నాయి. 1972 లో జరిగిన ఎన్నికలు అప్రతిష్ఠపాలయ్యాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో, ఎన్నికల చరిత్రలో ఒక మరకలా 1972 బెంగాల్ ఎన్నికలు మిగిలాయి. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ భారీ విజయం సాధించారు. అప్పట్లో ఇందిరా కాంగ్రెస్ పేరు కాంగ్రెస్ (ఆర్). బెంగాల్లోని మొత్తం 280 అసెంబ్లీ స్థానాల్లో వామపక్షాలకు కేవలం 14 స్థానాలు మాత్రమే లభించాయి. వామపక్షాలు నామరూపాల్లేకుండా ఓడిపోయాయి. కమ్యూనిస్టు అనుకూల మీడియా ప్రకారం, విశ్లేషకుల ప్రకారం అప్పటి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది.
కాని కాస్త జాగ్రత్తగా అప్పటి ఎన్నికలను విశ్లేషించడం అవసరం. అప్పట్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బలంగానే కనిపించింది. భారీ విజయం కాకపోయినా, కాంగ్రెస్ విజయం సాధించవచ్చనే వాతావరణమే ఎన్నికలకు ముందు ఉంది. దీనికి ముఖ్యమైన కారణం 1972 బంగ్లాదేశ్ యుద్ధం. కాని బెంగాల్లో కాంగ్రెస్ ఓడిపోవచ్చనే అనుమానాలతో సిద్ధార్థ్ శంకర్ రే చివరి నిమిషంలో ఎలాగైనా గెలవడానికి ప్రయత్నించాడు. సిద్ధార్థ్ శంకర్ రే ఇందిరాగాంధీకి సన్నిహిత నాయకుడు. ఎలాగైనా, ఏం చేసైనా గెలవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదు. అనేక అవకతవకలు జరిగాయి. చివరకు కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.
కారణమేదైనా కాని అప్పట్లో ఎన్నికలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో కండబలం చూపించిందని ఆరోపణలు బలంగా వచ్చాయి. ఓటర్లను పోలింగ్ బూతు ల వద్ద అడ్డుకున్నారని, బూత్ కాప్చరింగ్ పెద్ద ఎత్తున జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో హఠాత్తుగా ఓట్లన్నీ ఒక పార్టీకి పోలవ్వడం కూడా అనుమానాలను పెంచింది. క్లుప్తంగా చెప్పాలంటే 1972 ఎన్నికలు రిగ్గింగ్ భారీ ఎత్తున జరిగిన ఎన్నికలుగా ముద్రపడ్డాయి.
బెంగాల్ కోసం బిజెపి తహతహ: ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు ఎలాగైనా గెలవాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెంగాల్లో కాలుమోపే అవకాశం దొరికిందన్నది బిజెపికి తెలుసు. కాని ఎన్నికలు గెలిచే స్థాయి బలం లేదన్నది కూడా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చెప్పుచేతల్లో అధికారాలన్నీ ఉన్నాయి. వనరులన్నీ ఉన్నాయి. గెలవడానికి ఎలాంటి రాజకీయాలైనా వెనుదీయని చరిత్ర ఉంది.
బెంగాల్‌లో గెలవాలన్న బిజెపి కోరిక రహస్యమేమీ కాదు. యావద్దేశంలో బిజెపి ప్రభుత్వాలుండాలనే కోరిక ఎలాగూ ఉండనే ఉంది. దానికి తోడు ఇప్పుడు బెంగాల్లో గెలవడం రాజకీయ అవసరంగా కూడా మారింది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ముందు ముందు మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఉత్తరాదిలో ఎదురయ్యే నష్టాలను పూడ్చుకోడానికి దక్షిణాది వైపు, తూర్పు రాష్ట్రాల వైపు చూస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి అవకాశాల్లేవు. కాబట్టి బెంగాల్లో బలంపుంజుకోవడం రాజకీయ అవసరం. ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి నాయకులు ఏ స్థాయి రాజకీయాలు నడపగలరో ఢిల్లీ ఎన్నికలు తాజా ఉదాహరణలు. బెంగాల్ ఎన్నికల విషయంలో ఈ భయాలే చాలా మందిలో ఉన్నాయి.
బెంగాల్ అసెంబ్లీలో ఇప్పుడు బిజెపికి కేవలం మూడు స్థానాలున్నాయి. కాని 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం పుంజుకుంది. తృణమూల్ కన్నా కేవలం 3 శాతం పాయింట్లతో వెనుకబడింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వస్తే బిజెపి 126 సీట్లు గెలుచుకోగలదు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో మరోసారి ఓట్లు రాబట్టుకోవడం అంత తేలిక కాదని బిజెపికి తెలుసు. మమతా బెనర్జీని ఢీకొనే రాజకీయ నాయకత్వం బిజెపికి బెంగాల్లో లేదు. పైగా ప్రజల వద్దకు వెళ్ళడానికి బలమైన ఎన్నికల సమస్య కానీ, పటిష్టమైన ఎజెండా కానీ ఏదీ బిజెపి వద్ద లేదు. బెంగాల్లో అవకాశం ఊరిస్తుంది కాని అందుకోవాలంటే చేతులకు చిక్కడం లేదు.
ఈ నేపథ్యంలో చూస్తే బెంగాల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో అనే భయాలకు కారణాలు అర్థమవుతాయి. అనేక రకాలుగా బెంగాల్ 2021 ఎన్నికలు 1972 ఎన్నికలను పోలి ఉన్నాయి. గెలవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. రాజ్‌భవన్ నుంచి గవర్నర్ సమాంతరంగా పరిపాలించే పరిస్థితి రావచ్చు. రాజ్ భవన్ బిజెపి ప్రధాన కార్యాలయంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే స్థానిక బ్యూరోక్రసీని తమ అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు రెండు పార్టీలు పెద్ద ఎత్తున చేస్తాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. నిర్భయంగా, నిష్పక్షపాతంగా పని చేయడం లేదనే విమర్శలు మరింత ఎక్కువ కావచ్చు.
ఎన్నికల సంఘం తటస్థంగా ఉందని నిరూపించుకోవలసిన అవసరం ఈ ఎన్నికల్లో మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఒత్తిళ్ళు కూడా ఈ ఎన్నికల్లో మన ముందుకు రావచ్చు. అలాగే క్షేత్రస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న కార్యకర్తల బలం బిజెపికి లేదు. కాబట్టి తృణమూల్ కార్యకర్తల ప్రాబల్యాన్ని అడ్డుకోడానికి బిజెపి తన చేతుల్లో ఉన్న అధికార బలాన్ని, వివిధ సంస్థలను ఉపయోగించవచ్చు. వీటన్నింటికి మించి ఇప్పుడు ఎన్నికల్లో ధనబలం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పంజాబ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల్లో ధనప్రవాహాలు బెంగాల్ ఎన్నికల్లో ఇంత వరకు లేవు. కాని ఇప్పుడు బిజెపి దేశంలోనే సంపన్నపార్టీ. ఎన్నడూ లేని స్థాయిలో ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెడుతున్న చరిత్ర కూడా ఉంది. ఇప్పుడిక బెంగాల్ ఎన్నికల్లో కూడా డబ్బు నీళ్ళలాగా ప్రవహించవచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు.
చివరి విషయమేమిటంటే, ఎన్నికలు గెలవడానికి బిజెపి ఢిల్లీలోను, అంతకు ముందు ఎన్నికల్లోను ఏం చేసిందో అందరూ చూశారు. మత విద్వేషాన్ని పెద్ద స్థాయిలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగవచ్చు. బెంగాల్లో ముస్లిం జనాభా పాతికశాతం ఉంది. మతకలహాల చరిత్ర కూడా చాలా ఉంది. దేశ విభజన తర్వాత రెండు సముదాయాల మధ్య పెద్ద అఖాతమే ఏర్పడింది. ఈ ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు బెంగాల్లో మత వర్గాల మధ్య చిచ్చుపెట్టి సామరస్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయనే భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భయాలేవీ నిజం కారాదని కోరుకుందాం.