కీలక నిర్ణయాలు ప్రకటించిన బెంగాల్, తమిళనాడు
కోల్‌కతా/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడానికి కొద్ది గంటల ముందు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేశాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో సంక్షేమ పథకాలను ప్రకటించాయి. రోజువారీ కూలీల వేతనాన్ని పెంచుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ పథకాన్ని తమిళనాడు సిఎం పళనిస్వామి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రోజువారీ కూలీలను మూడు కేటగిరీలుగా విభజించింది. నైపుణ్యాల ఆధారంగా వారి వేతనాల పెంపును ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 56,500 మంది40,500 మంది అన్‌స్కిల్డ్, 8,000 మంది సెమీ స్కిల్డ్, 8,000 మంది స్కిల్డ్ వర్కర్లు దీనివల్ల లబ్ధి పొందుతారని మమత ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా పేద కుటుంబాలు, మహిళలను రుణ విముక్తులను చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం బంగారంపై రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ప్రకటించింది. కో ఆపరేటివ్ బ్యాంకులు, కో ఆపరేటివ్ సహకార సంస్థల్లో బంగారం తనఖా పెట్టిన వారి రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పెట్రోలు, డీజిలుపై వ్యాట్‌ను 2 శాతం తగ్గిస్తున్నట్లు లెఫ్టెనెంట్ గవర్నర్ పేర్కొన్నారు.