న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలు నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండే ఫంక్షన్లు, సమావేశాలు లాంటి విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని గౌబా ఆయా రాష్ట్రాల అధికారులను కోరారు. శనివారం జరిగిన సమావేశంలో మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
గత వారం రోజులుగా ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం గమనార్హం. ఇప్పటివరకు కొనసాగించిన నిఘాలో ఎలాంటి ఉదాసీనత చూపించవద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ రాష్ట్రాలకు సూచించడం జరిగిందని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉండే ఫంక్షన్లు, సభలు, సమావేశాలు లాంటి విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని కూడా ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు చెప్పారు. ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న జిల్లాల్లో ప్రయారిటీ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఈ సమీక్షా సమావేశంలోసూచించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉన్న జిల్లాల్లో వాటి సంఖ్యను పెంచాలని, ఎక్కువ యాంటిజెన్ పరీక్షలు జరుగుతున్న జిలాల్లో ఆర్‌టిపిసిఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని కూడా ఈ సమావేశంలో సూచించినట్లు హోం శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
Cabinet Secretary Rajiv Gauba Review on Covid 19