కపుర్తల(పంజాబ్): గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం ఉన్న ఎసి త్రీ టైర్ ఎకానమి క్లాస్ కోచ్‌ల ఉత్పత్తిని ఇక్కడి రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్‌సిఎఫ్) ప్రారంభించినట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. నాగ్డా-కోట-సవాయ్ మధోపూర్ సెక్షన్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్‌లను విజయవంతంగా నిర్వహించిన తర్వాత వీటి ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఆర్‌సిఎఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. ఆధునీకరించిన మొట్టమొదటి ఎసి త్రీ టైర్ కోచ్‌ను ట్రయల్ రన్ కోసం ఫిబ్రవరి 10న రిసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(ఆర్‌డిఎస్‌ఓ)కు ఆర్‌ఎఫ్‌సి అందచేసింది.
మూడు వారాల పాటు ఉధృతంగా ట్రయల్స్ నిర్వహించిన తర్వాత వీటి సామర్ధంపై ఆర్‌డిఎస్‌ఓ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటివి 248 బోగీలు కావాలని రైల్వే బోర్డు కోరినట్లు ఆయన తెలిపారు. మార్చి నెలాఖరుకు ఆర్‌సిఎఫ్ 50 బోగీలు అందచేస్తుందని, మిగిలిన బోగీలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ బోగీలను సూపర్ ఫాస్ట్, ఎక్సెప్రెస్ రైళ్లకు జతచేరుస్తారని గుప్తా వివరించారు. ఈ బోగీలలో బెర్త్‌ల సంఖ్యను 72 నుంచి 83కు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కాలితో ఆపరేట్ చేసే నీటి ట్యాప్‌లు, ఫ్లష్‌లు, తదితర ఇతర సౌకర్యాలను వీటిలో కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్-19 విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి బోగీలను వ్యాక్సిన్ రహితంగా రూపొందించేందుకు ఎయిర్ ఫిల్టరేషన్ వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు గుప్తా వివరించారు.