ప్రజల సమయానికి విలువ
నిన్నటి వరకు కోటీ 56 లక్షల డోసులు
కొత్త కేసులు 14,989, మరణాలు 98
కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా సమయ నియంత్రణను తొలగిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ప్రతిరోజూ 24 గంటల్లో ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధాని మోడీ అర్థం చేసుకున్నారని హర్షవర్ధన్ ట్విట్ చేశారు. దేశంలో బుధవారం ఉదయం 7 గంటల వరకు మొత్తం 1,56,20,749 డోసుల టీకాలిచ్చారు. వీరిలో రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు 27,13,144మంది కాగా, ఒక్క డోసు తీసుకున్నవారు 67,42,187మంది. ఒక్క డోసు తీసుకున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లు 55,70,230మంది కాగా, రెండు డోసులు తీసుకున్నవారు 834మంది. 45ఏళ్లు పైబడినవారిలో తీవ్ర వ్యాధులతో బాధపడుతూ మొదటి డోసు పొందినవారు 71,896మంది కాగా, 60 ఏళ్లు పైబడినవారు 5,22,458మంది.
మొదటిదశలో ఆరోగ్య కార్యకర్తలు,ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాల కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. వారికిపుడు రెండో డోసు ఇస్తున్నారు. అంతేగాక వారిలో మొదటి డోసు ఇంకా తీసుకోనివారికి కూడా టీకాలిస్తున్నారు. రెండోదశలో మార్చి 1నుంచి 60 ఏళ్లు నిండినవారితోపాటు 4560 మధ్య వయస్కుల్లోని తీవ్ర వ్యాధులతో బాధపడేవారికి మొదటి డోసు ఇస్తున్నారు.
దేశంలో బుధవారం ఉదయం 8 గంటలవరకల్లా 24 గంటల్లో 14,989 కరోనా కేసులు నమోదు కాగా,98మంది మరణించారు. దీంతో, మొత్తం కేసులు 1,11,39,516, రికవరీలు 1,08,12,044 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,128, మరణాల సంఖ్య 1,57,346కు చేరింది. దీంతో,రికవరీ రేట్ 97.06 శాతంగా, యాక్టివ్ కేసుల రేట్ 1.53 శాతంగా, మరణాల రేట్ 1,41 శాతంగా నమోదైంది. మంగళవారం 7,85,220 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 21,84,03,277కు చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. 24 గంటల్లో 24 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.